శివకేశవుల ఇష్టాలు

శివకేశవుల ఇష్టాలు
ఒక్కోవారం ఒక్కో దైవానికి ఇష్టమని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం శివుడికి ... మంగళవారం హనుమంతుడికి ... బుధవారం వినాయకుడికి ... గురువారం దత్తాత్రేయుడికి ... శుక్రవారం అమ్మవారికి ... శనివారం వేంకటేశ్వరుడికి ... ఆదివారం సూర్యుడికి ఇష్టమని కూడా చెబుతున్నాయి. ఈ రోజుల్లో ఆయా దేవతలను పూజించడం వలన వాళ్లు వెంటనే అనుగ్రహిస్తారని అంటున్నాయి.

ఇక ఆయా దేవతలు ఆయా వారాలను ఇష్టపడటానికి కారణాలు లేకపోలేదు. శివకేశవుల విషయానికే వస్తే, సోమవారాన్ని శివుడు ... శనివారాన్ని వేంకటేశ్వర స్వామి ఇష్టపడుతుంటారు. 'సోమ' అంటేనే స+ఉమ (ఉమతో కలిసి వున్నవాడు) అనే అర్థం వస్తుంది. ఇక 'సోముడు' అనే పేరుగల చంద్రుడు శివుడికి కావలసిన చల్లదనాన్ని అందిస్తూ ఆయన ప్రేమాభిమానాలకు కారకుడయ్యాడు. అందువల్లనే శివుడికి సోమవారం అంటే ఇష్టమని చెప్పడం జరిగింది.

ఇక వేంకటేశ్వరుడి వక్ష స్థలాన శ్రీమహాలక్ష్మి నిలిచినది ... ఆలయ నిర్మాణానికి తొండమానుడు శ్రీకారం చుట్టినది ... స్వామివారు ఆలయ ప్రవేశం చేసినది ... పద్మావతీ దేవిని వివాహమాడినది శనివారం రోజునే. అందువల్లనే వేంకటేశ్వరుడికి శనివారం అంటే ఇష్టమని అంటారు. ఈ నేపథ్యంలో శివుడిని ఆరాధించే వారు సోమవారం ... కేశవుడిని పూజించే వారు శనివారం ఉపవాసాలు చేస్తూ వారి అనుగ్రహానికి పాత్రులవుతుంటారు.

More Bhakti Articles