మద్దిలేటి నారసింహుడు

మద్దిలేటి నారసింహుడు
సంకల్ప మాత్రం చేతనే నృసింహస్వామిగా అవతరించిన శ్రీమహావిష్ణువు, అనేక ప్రదేశాల్లో స్వయంభువుగా ఆవిర్భవించాడు. కోరిన వరాలను అనుగ్రహిస్తూ భక్తుల ఇలవేల్పుగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అలా ఆ స్వామిని నిత్యం దర్శించే భాగ్యానికి నోచుకున్నారు 'రంగాపురం' గ్రామస్తులు. నారసింహ క్షేత్రాలలో విశిష్టతను సంతరించుకున్న ఈ గ్రామం కర్నూలు జిల్లా బేతంచర్ల మండలంలో దర్శనమిస్తుంది. మద్దిలేరు దగ్గర స్వామివారు అవతరించిన కారణంగా, మద్దిలేటి నారసింహుడిగా భక్తులు పిలుస్తుంటారు.

ఇక స్వామివారు ఇక్కడ అవతరించిన తీరు ఆసక్తికరంగా వుంటుంది. పూర్వం ఈ ప్రాంతం 'కన్నప్ప' అనే రాజు ఏలుబడిలో వుండేది. ఒకరోజు ఆయన వేటలో భాగంగా ఒక జంతువును తరుముతూ వెళ్లాడు. అది ఒక గుహలోకి వెళ్లి అదృశ్యం కావడంతో, నిరాశగా ఇంటికి చేరుకున్నాడు. ఆ రాత్రి నృసింహస్వామి అతనికి కలలో కనిపించి, జంతువు రూపంలో అతనికి కనిపించింది తానేనని చెప్పాడు. తన జాడ తెలియజెప్పడానికి తాను చేసిన ప్రయత్నాన్ని అతను అర్థం చేసుకోలేకపోయాడని అన్నాడు. మర్నాడు అతను అదే ప్రదేశానికి వస్తే బాలుడి రూపంలో దర్శనమిస్తానని చెప్పాడు.

మరునాడు తన పరివారంతో ఆ ప్రదేశానికి వెళ్ళిన రాజుగారు, అక్కడ కనిపించిన బాలుడిని తన భుజాలపై నెక్కించుకుని ఊరేగింపుగా తన ఊరుకి తీసుకువచ్చాడు. తీరా బాలుడిని రాజుగారు కిందికి దింపుతుండగా, ఆ బాలుడు ఎలాంటి రూపురేఖలు లేని ఒక శిలగా మారిపోయాడు. దాంతో అది స్వామి మహిమగా గుర్తించి ఆ శిలను అక్కడే ప్రతిష్ఠించి పూజించుకోవడం మొదలుపెట్టారు. కాలక్రమంలో ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఇక్కడి స్వామిని ఏదైనా కోరుకుంటే, అది నెరవేరుతుందనడానికి సూచనగా స్వామివారి మెడలోని మాల కిందపడుతుందని అంటారు. ఎంతోమంది రాజులు ఇక్కడి స్వామివారిని దర్శించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రతి యేటా వైశాఖ మాసంలో జరిగే నృసింహ జయంతిని పురస్కరించుకుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.

More Bhakti Articles