శివకేశవ క్షేత్రం

శివకేశవ క్షేత్రం
శివకేశవులకు భేదం లేదని ఎన్నో పురాణాలు చెప్పాయి. ఎందరో మహా భక్తులు ఈ విషయాన్ని అనుభవ పూర్వకంగా స్పష్టం చేశారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో విష్ణువు ... వైష్ణవ క్షేత్రాల్లో శివుడు క్షేత్ర పాలకులుగా వ్యవహరిస్తుంటారు. కొన్ని పుణ్య క్షేత్రాల్లో ఇద్దరూ కొలువుదీరి కనిపిస్తూ కనువిందు చేస్తుంటారు. అలాంటి శివకేశవులు ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం విశేషంగా అనిపిస్తుంది ... అనిర్వచనీయమైన అనుభూతిని అందిస్తుంది.

అంతటి విశిష్టతను సొంతం చేసుకున్న ఈ క్షేత్రం మనకు తిరుపతికి సమీపంలోని 'తొండవాడ'లో కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో అగస్త్య మహర్షి శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి 'రుద్రకోటి అగస్తేశ్వరాలయం' అనే పేరు వచ్చింది. ఇక ఇక్కడ ఒకే విగ్రహానికి ముందు వైపున విష్ణువు ... వెనుక భాగంలో శివుడు దర్శనమిస్తుంటారు. శివుడికి ఎదురుగా నంది కాకుండా ఆయన మరో శిష్యుడైన 'భ్రుంగి' కొలువుదీరి వుండటం ఇక్కడి మరో విశేషంగా భక్తులు చెప్పుకుంటూ వుంటారు.

ఇక అగస్త్య మహర్షి ఇక్కడ శివారాధన చేస్తుండగా, నారాయణవనంలో పద్మావతి దేవిని వివాహమాడిన శ్రీనివాసుడు తిరుమల వెళుతూ ఇక్కడికి వచ్చాడట. అగస్త్య మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి ఆరునెలల పాటు ఇక్కడ వుండి వెళ్లాడు. ఇందుకు నిదర్శనంగా ఇక్కడ స్వామివారి పాద ముద్ర కూడా నేటికీ కనిపిస్తూ వుంటుంది. ఈ కారణంగా కూడా ఇది శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. శివ కేశవులకు సంబంధించిన పర్వదినాల్లో ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. అశేష భక్తులకు అనంతమైన పుణ్య ఫలాలను ప్రసాదిస్తూ వుంటాయి.

More Bhakti Articles