వరాల పద్మనాభుడు

వరాల పద్మనాభుడు
తన అల్లరి చేష్టలతో .... ఆకతాయి పనులతో యుగయుగాలుగా అందరి మనసులో నిలిచిపోయిన శ్రీ కృష్ణుడే అనంత పద్మనాభుడు. తనని దర్శించడం వలన ... తన వ్రతం చేసుకోవడం వలన కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని ఆయనే స్వయంగా పాండవులకు చెప్పాడు. అయితే ఆయన అనంతుడిగా వెలసిన క్షేత్రాలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. అలాంటి అరుదైన పుణ్య క్షేత్రంగా నిజామాబాద్ జిల్లా మల్కాపూర్ కనిపిస్తుంది.

లక్ష్మీ సమేతంగా గుట్టపైనున్న గుహలో వెలిసిన అనంతుడు, ప్రాచీనకాలం నుంచి పూజలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం ఇక్కడ స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తోన్న అర్చకుల కుటుంబంలోని పూర్వీకులకు స్వామివారు కలలో కనిపించి, తాను ఇక్కడి గుహలో వెలుస్తున్నట్టుగా చెప్పారట. స్వామివారు కలలో చెప్పిన సూచనల మేరకు ఈ గుహను ... లక్ష్మీ అనంతుల రూపాలను గుర్తించి సేవలు చేయడం ఆరంభించారు.

స్వయంభువుగా వెలసిన రూపం రాళ్ల మధ్యలో వుండటం వలన, మరో విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. కొండపై వెలసిన ఈ దేవుడిని చుట్టుపక్కల గ్రామస్తులు కోరిన వరాలను ప్రసాదించే కొండంత దైవంగా భావిస్తుంటారు. ఆ స్వామి కూడా వారిని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు విరివిగా జరుగుతుంటాయి. ఏడాదికి ఒకసారి వచ్చే 'అనంతపద్మనాభస్వామి వ్రతం'లో కూడా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.

అనంత పద్మనాభుడికి ప్రతి యేటా మాఘ శుద్ధ బహుళ తదియ నుంచి అష్టమి వరకూ అంటే వారం రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పరిసర ప్రాంతాల్లోని గ్రామాలు ఏడాదికి ఒకసారి వంతులు వేసుకుని ఈ ఉత్సవాలను జరిపిస్తుంటాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

More Bhakti Articles