శ్రీ అవనాక్షమ్మ ఆలయం

శ్రీ అవనాక్షమ్మ ఆలయం

శ్రీ అవనాక్షమ్మ ఆలయం
అశేష భక్త జనకోటిచే పూజలందుకుంటోన్న తిరుమల శ్రీనివాసుడు - పద్మావతి అమ్మవారు ఇద్దరూ కలిసి పూజించిన శక్తి స్వరూపిణి 'శ్రీ అవనాక్షమ్మ'. సాధారణంగా వివాహం కావలసిన వారు, తమకి సద్గుణ సంపన్నుడు భర్తగా లభించాలని పద్మావతి అమ్మవారిని కోరుతుంటారు. ఇక కొత్త దంపతులు శ్రీనివాస పద్మావతుల దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు అందుకుంటూ వుంటారు.

అయితే పద్మావతీ అమ్మవారు తనకి శ్రీనివాసుడితో వివాహం జరిగేలా చూడమని 'అవనాక్షమ్మ'ను కోరింది. శ్రీనివాసుడితో వివాహం జరిగాక, ఆయనతో కలిసి అవనాక్షమ్మ ఆశీర్వాదం తీసుకుంది. కలియుగ దైవానికే ఆశీస్సులు అందజేసిన ఈ అవనాక్షమ్మ ఎవరో కాదు ... పసి మనసున్న తల్లి పార్వతీ దేవి. అవనాక్షమ్మ ఆవిర్భవించిన ఈ క్షేత్రం చిత్తూరు జిల్లా నారాయణ వనం సమీపంలో అరుణా నది తీరాన దర్శనమిస్తుంది.

ఇక్కడ వెలసిన అవనాక్షమ్మ పద్మావతీ దేవి కుటుంబీకుల కులదైవం. ప్రతి ఉదయం ఆమెను దర్శించి ... పూజించిన తరువాతే ఆకాశ రాజు మిగతా పనులు చూసుకునే వాడట. అగస్త్య మహర్షి కోరిక మేరకు ఇక్కడ వెలసిన అవనాక్షమ్మకి ఆలయాన్ని నిర్మించినది ఆకాశ రాజే. ఈ తల్లి అనుగ్రహంతోనే ఆకాశ రాజు దంపతులకు పద్మావతీ దేవి జన్మించింది. అందువలన ఊహ తెలిసిన నాటి నుంచి అవనాక్షమ్మతో పద్మావతీ దేవికి అనుబంధం వుంది.

గర్భాలయంలో అవనాక్షమ్మ విగ్రహ రూపంలోనూ ... శివుడు లింగరూపంలోను దర్శనమిస్తుంటారు. ప్రతి యేటా ఇక్కడ సెప్టెంబర్ మాసంలో 18 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఇక అక్టోబర్ మాసంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. జగాలనేలే తల్లిదండ్రులే ఆదిదంపతుల ఆశీస్సులు అందుకున్న ఈ క్షేత్రం ... దర్శన మాత్రం చేతనే ధన్యులను చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles