శ్రీ కురుమూర్తి క్షేత్రం

శ్రీ కురుమూర్తి స్వామి పేరు భక్తులు చాలా తక్కువగా విని వుంటారు. అంత మాత్రాన ఈ స్వామి కొత్తగా అవతరించిన వాడు కాదు. సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుడే ఈ క్షేత్రంలో కురుమూర్తి స్వామిగా పిలవబడుతుంటాడు. అశేష భక్త జనకోటిచే ఆరాధించబడుతోన్న ఈ క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింత కుంట మండలంలోని 'అమ్మపురం'లో దర్శనమిస్తోంది.

వేంకటేశ్వరుడు ఇక్కడ కూడా ఏడు కొండలపైనే వెలసి తన భక్తులను అనుగ్రహిస్తుంటాడు. ఇక స్వామివారు ఇక్కడ కొలువుదీరడానికి కారణమైన కథ ఒకటి మనకి స్థల పురాణంగా కనిపిస్తుంది. కుబేరుడి దగ్గర అప్పుచేసి మరీ శ్రీనివాసుడు పద్మావతీ దేవిని వివాహం చేసుకుంటాడు. అయితే కాలం గడుస్తున్నా వడ్డీ చెల్లించకపోవడంతో, కుబేరుడు నేరుగా శ్రీనివాసుడి దగ్గరకి వచ్చి అడుగుతాడు. అతనలా పట్టుబట్టడంతో స్వామివారు అక్కడ సరదాగా గడపలేక, అమ్మవారిని వెంటబెట్టుకుని వేరే ప్రదేశానికి విహారానికి బయలుదేరాడు.

మార్గ మధ్యంలో వారు ఆత్మకూరు సమీపంలోని కృష్ణానదిలో జలకాలు ఆడారు. అందుకు సంతోషంతో పొంగిపోయిన కృష్ణమ్మ, శ్రీవారికి ... అమ్మవారికి పాదుకలను సమర్పించుకుంది. ఆ తరువాత శ్రీవారు ... అమ్మవారు ఈ క్షేత్రానికి వచ్చారు. అమ్మవారికి ఈ ప్రదేశం ఎంతగానో నచ్చడంతో, ఆమె కోరిక మేరకు స్వామివారు సతీ సమేతంగా ఇక్కడ కొలువుదీరాడు. అమ్మవారికి ఇష్టమైన ప్రదేశం కనుకనే ఈ ప్రదేశానికి 'అమ్మాపురం' అనే పేరు వచ్చింది.

అయ్యవారు - అమ్మవారు ఇక్కడ వెలసిన రోజు 'కార్తీక శుక్ల పంచమి' కావడంతో, ప్రతియేటా ఆ తిథిలో ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. పది రోజులకు పైగా జరిగే ఈ వేడుకలను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు.


More Bhakti News