క్షేత్ర దర్శనం

క్షేత్ర దర్శనం
సాధారణంగా పుణ్య క్షేత్రాలను దర్శించాలానే ఆలోచన యవ్వనంలో వుండగా రాదు. క్షేత్ర దర్శనం అనేది వయసుమళ్లిన వాళ్లు మాత్రమే చేయాలని అనుకుంటూ వుంటారు. నిజానికి పుణ్య తీర్థాలను వయసులో ఉండగానే దర్శించాలి ... ఆ జ్ఞాపకాలు పంచే అనుభూతిని వయసుమళ్లిన తరువాత అనుభవించాలి. వయసుమళ్లిన తరువాత తీరిక వుంటుంది కానీ ఓపిక వుండదు.

ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే దివ్య క్షేత్రాలను దర్శిస్తూ ... మనసుతో స్పర్శిస్తూ వెళ్ళాలి. దేవుడు ఎక్కడ లేడు? ఆయనని వెదుక్కుంటూ అంతంత దూరాలు వెళ్లడం అవసరమా? అనుకునేవారు లేకపోలేదు. దేవుడు అడుగడుగునా వున్నాడు ... అణువణువునా వున్నాడు. కాకపోతే పుణ్య క్షేత్రాలకు స్థల మహాత్మ్యం వుంటుంది. దేవతలు ... ఋషులు ... మహా పురుషుల పాద ధూళితో ఆ ప్రదేశాలు మరింత పవిత్రమమై వుంటాయి. అక్కడి నీరు ఎన్నో ఔషధ గుణాలను సంతరించుకుని వుంటుంది.

ముఖ్యంగా ఇలా పుణ్య క్షేత్రాలకి వెళ్ళినప్పుడే మనకంటే మంచివాళ్లు ... మహాభక్తులు ఎంతమంది వున్నది తెలుస్తుంది. వాళ్లని అనుసరించే అవకాశం లభిస్తుంది. ఇక పుణ్య క్షేత్రాలను దర్శించినంత మాత్రాన పుణ్యం మనవెంట వచ్చేయదు. మనలోని ఈర్ష్య ... అసూయ ... ద్వేషం ... స్వార్ధం వంటివి అక్కడే పూర్తిగా వదిలేయాలి. భగవంతుడు ఇచ్చిన దానిలో మనం ఇతరులకు ఎంత వరకూ సాయపడగలమనే విషయాన్ని గురించిన ఆలోచన చేయాలి.

ఎదుటివాడికి చేయూతనివ్వాలని అనుకున్నప్పుడే, మనం పడిపోకుండా దైవం కాపాడుతుందని గుర్తుంచుకోవాలి. మానవత్వమే మనిషిని మహనీయుడిని చేస్తుంది ... దైవానుగ్రహానికి దగ్గర చేస్తుంది. ఇలాంటి మార్పు రానంత వరకూ చేసే యాత్రల వలన అలసట మిగులుతుందే తప్ప అసలు ప్రయోజనం మాత్రం నెరవేరదు.

More Bhakti Articles