మట్టి బొమ్మల మహేశ్వరుడు

మట్టి బొమ్మల మహేశ్వరుడు
మనసులోని కోరికలు చెప్పుకోవడానికి ... అవి నెరవేరేలా చేయమని కోరుకోవడానికే పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ వుంటారు. తమ కోరికలు దైవం నేరవేర్చినప్పుడు అందుకు కృతజ్ఞతగా ఆ దైవానికి తాము అనుకున్న మొక్కులు చెల్లిస్తుంటారు. అయితే ఆ మొక్కులు ఖర్చుతో కూడుకున్నవి అయితే, డబ్బు సర్దుబాటు అయ్యేంత వరకూ వాయిదా వేస్తూ వస్తుంటారు.

ఈ విషయంలో దిగులు పెట్టుకోవలసిన అవసరం లేకుండా ఇక్కడి శివుడు కేవలం మట్టిబొమ్మలు మాత్రమే మొక్కుగా స్వీకరిస్తుంటాడు. మహాశివుడు కొలువుదీరిన ఈ క్షేత్రం, కర్ణాటక రాష్ట్రం బెల్తంగడి తాలూకాలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో కనిపించే జంట శిలలను పార్వతీ పరమేశ్వరులుగా స్థానికులు భావిస్తుంటారు. భ్రుగు మహర్షి తపస్సుకు మెచ్చి వారు ఇక్కడ వెలసినట్టుగా చెబుతారు.

పరమశివుడి వాహనమైన నందీశ్వరుడు ఒకానొకసారి కైలాసానికి పోయే అర్హత కోల్పోయి భూలోకంలోనే ఉండిపోయాడట. అప్పుడాయన కైలాస ప్రవేశాన్ని కోరుతూ శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలనుకున్నాడు. సమయానికి అవి కనిపించకపోవడంతో, మట్టితో బిల్వ పత్రాల ఆకారాన్ని తయారు చేసి వాటినే భక్తితో సమర్పించి శివుడు అనుగ్రహాన్ని పొందాడు. ఈ కారణంగానే ఇక్కడ మట్టి బొమ్మలతో మొక్కుచెల్లించే సంప్రదాయం మొదలైందని అంటారు.

ముందుగా మొక్కుకుని ఇల్లు కట్టుకున్న వారు ... వాహనం కొనుక్కున్నవారు ... ఆయా మట్టిబొమ్మలతో తమ మొక్కు చెల్లించుకుంటూ వుంటారు. శివయ్య మంచి మనసుకి ఇంతకన్నా మంచి నిదర్శనం ఏముంటుంది?

More Bhakti Articles