కపోతేశ్వరాలయం

కపోతేశ్వరాలయం
పరమ శివుడికి సంబంధించిన ప్రతి క్షేత్రం ఒక్కో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. ఆ మహాదేవుడు కొలువుదేరిన క్షేత్రాలు ఆయన లీలా విన్యాసాలకు ఆనవాళ్లుగా కనిపిస్తూ వుంటాయి. అలా ఆయన మహిమలకు వేదికగా నిలిచిన పుణ్య క్షేత్రమే 'కపోతేశ్వరాలయం'. ఇది తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలంలోని 'కడలి' గ్రామంలో దర్శనమిస్తుంది.

భక్తవ శంకరుడు ఇక్కడ ఆవిర్భవించడానికి బలమైన కారణం లేకపోలేదు. ఈ ప్రాంతానికి వచ్చిన ఓ వేటగాడు ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రయత్నించినా వేట దొరకలేదు. దాంతో అతను ఆకలికి అలమటిస్తూ ఒక చెట్టుకింద కూలబడిపోయాడు. తన దగ్గరికి జంతువులు రాకుండా వుండటం కోసం ఎదురుగా మంట వేసుకున్నాడు.

ఆ వేటగాడి పరిస్థితి చూసిన ఓ ఆడ పావురం అతనికి ఆహారంగా మారడం కోసం నేరుగా వచ్చి ఆ మంటలో పడి ప్రాణాలు విడిచింది. అతను ఆశ్చర్యపోయి చూస్తుండగానే, ఆడపక్షి వియోగాన్ని భరించలేని మగపక్షి కూడా వచ్చి ఆ మంటల్లో పడిపోయింది. తన ఆకలి తీర్చడం కోసమే అవి అలా చేశాయనే నిజాన్ని తట్టుకోలేక ఆ వేటగాడు కూడా ఆత్మాహుతి చేసుకున్నాడు.

అప్పుడు శివుడు ప్రత్యక్షమై వారికి మోక్షాన్ని ఇవ్వడమే కాకుండా, 'కపోతేశ్వరుడు' గా ఈ ప్రదేశంలో వెలిశాడు. ఈ కారణంగానే ఇక్కడి శివలింగంపై పావురాళ్ల ఆనవాళ్లు కనిపిస్తాయని అంటారు. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రం కనుకనే ఇక్కడకి వస్తోన్న భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది.

More Bhakti Articles