శ్రీ దత్తాత్రేయ వ్రతం

శ్రీ దత్తాత్రేయ వ్రతం
శ్రీ దత్తాత్రేయ వ్రతం ఎంతో శక్తిమంతమైనది ... మరెంతో మహిమాన్వితమైనది. అనసూయ - అత్రి మహర్షి దంపతుల ప్రార్ధన మేరకు 'మార్గశిర శుద్ధ పౌర్ణమి' రోజున త్రిమూర్తుల అంశతో శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఈ రోజున స్వామివారి వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

దత్తాత్రేయ స్వామి అవతరించిన ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి నైవేద్యంగా సమర్పించిన పాలు - పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం చేయాలి. గురుచరిత్రను పారాయణం చేస్తూ ... దత్తానామాన్ని స్మరిస్తూ వుండాలి. సాయంత్రం కాగానే సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే మంటపంతో సహా దత్తాత్రేయ స్వామి పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి.

దత్తాత్రేయ స్వామిని పూజించి ఆ తరువాత వ్రతంలో భాగమైన అయిదు అధ్యాయాలుగల కథలు చదవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి మహిమలను ... ఆయన అనుగ్రహాన్ని ఈ కథలు కళ్లకి కడతాయి. పూజ పూర్తికాగానే , గోధుమ పిండి ... పంచదార .. ఆవునెయ్యి ... యాలకుల పొడి ... ఎండు ద్రాక్ష కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి.

తీర్థ ప్రసాదాల వినియోగం తరువాత, స్వామివారి పాదాల చెంతనున్న అక్షింతలు తలపై ధరించాలి. వ్రతాన్ని జరిపించిన బ్రాహ్మణుడికి శక్తి మేరకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఆచరించడమంటే, త్రిమూర్తులను ఆరాధించడం వంటిది. దత్తాత్త్రేయ వ్రతం కారణంగా ఆయన యొక్క అనుగ్రహం లభిస్తుంది. సమస్త పాపాలు నశించి .. ఆయురారోగ్యాలు ... సిరిసంపదలు కలుగుతాయి.

More Bhakti Articles