తిరుపతి గంగమ్మ

తిరుపతి గంగమ్మ
తమిళ సంప్రదాయం ప్రకారం 'చిత్రి'నెల చివరి మంగళవారం వచ్చిందంటే చాలు ... తిరుపతిలో 'గంగమ్మతల్లి' జాతర మొదలవుతుంది. జాతర సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఎనిమిది రోజులపాటు జరిగే ఈ జాతరలో ఒక్కో రోజు ఒక్కో అంశం చోటుచేసుకుంటూ వుంటుంది.

దుష్ట శిక్షణ చేయడానికే అమ్మవారు ఇక్కడ వెలసిందని స్థానిక కథనం చెబుతోంది. వివరాల్లోకి వెళితే ... పూర్వం ఈ ప్రాంతం పాలెగాళ్ల అధీనంలో వుండేది. ఒక పాలెగాడు తన అధికారాన్ని ప్రశ్నించే వారు లేకపోవడంతో, కన్నె పిల్లల పట్ల రాక్షసుడిగా మారాడు. అందరి అమ్మాయిల పట్ల ప్రవర్తించినట్టే, ఇక్కడికి సమీపంలోని 'అవిలాల' గ్రామానికి చెందిన గంగమ్మతో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు.

గంగ తిరగబడిన తీరు చూసి ఆమె సాధారణ స్త్రీ కాదని పాలెగాడు గ్రహించి పారిపోయి దాక్కున్నాడు. దాంతో అమ్మవారి అవతారమైన గంగ ... మూడు రోజుల పాటు మూడు వేషాలు ధరించి పాలెగాడి కోసం తిరిగింది. అయినా వాడు బయటికి రాకపోవడంతో, దొర వేషం ధరించింది. నిజంగానే దొర వచ్చాడనుకుని పాలెగాడు బయటికి రాగా అక్కడే వాడి తలను నరికేసింది. ఆ తరువాత రోజు 'మాతంగి' వేషంలో పాలెగాడి భార్యను కలుసుకుని ఆమెను ఓదార్చిందని చెప్పుకుంటారు.

ఈ సందర్భంగా ప్రతియేటా ఈ రోజు నుంచి ఎనిమిది రోజులపాటు గతంలో అమ్మవారు ధరించిన వేషాలను ధరిస్తూ జాతరను నిర్వహిస్తుంటారు. పార్వతీ దేవి సోదరుడిగా శ్రీ మహా విష్ణువు నిలిచిన సందర్భాలు పురాణాల్లో కనిపిస్తాయి. అలాగే ఇక్కడ తిరుమల వెంకన్న ... తన సోదరి అయిన ఈ గంగమ్మకు పుట్టింటి సారె పంపడం ఆనవాయతీగా వస్తోంది.

ఇక జాతర చివరి రోజున అమ్మవారి విశ్వరూపాన్ని బంకమట్టితో తయారు చేసి ... దర్శనం అనంతరం ఆ విగ్రహపు మట్టిని ప్రసాదంగా ఇస్తారు. ఆ మట్టిని ఇంట్లో భద్ర పరచడం వలన సుఖ సంతోషాలు ... సిరి సంపదలు కలుగుతాయని భక్తులు భావిస్తుంటారు.

More Bhakti Articles