నమస్కార ఫలితం

నమస్కార ఫలితం
సాధారణంగా మనకన్నా వయసులోనూ ... జ్ఞానంలోను ... సంస్కారంలోను ఉన్నతులైన వారిని చూడగానే మనం రెండు చేతులూ జోడించి నమస్కారం చేస్తుంటాం. ఇక కొన్ని సందర్భాల్లో మనకన్నా అన్ని విషయాల్లో తక్కువే అయినా అవతల వారికి గల అధికార హోదా ... వారితో మనకిగల పనులను బట్టి కూడా నమస్కారం చెబుతుంటాం. అయితే అంకిత భావంతో చేసే నమస్కారాలు వేరు ... అవసరార్ధం చేసే నమస్కారాలు వేరు.

మనసులోని భావాలను కళ్లు ఎలా బయటపెడుతుంటాయో, మనం చేసే నమస్కారం కూడా మన సంస్కారాన్ని అదే విధంగా ఆవిష్కరిస్తుంది. ఇక నమస్కారం ఎవరికి చేసినా మనస్పూర్తిగా చేయాలని శాస్త్రం చెబుతోంది. మనకన్నా ఉన్నతులకు చేసిన నమస్కారాల వలన ఉత్తమమైన ఫలితాలు ఉంటాయని కూడా అంటోంది. ఇక ఎవరికి నమస్కరిస్తున్నా అది దైవానికి చేరుతుందని భావించాలి. అవతల వ్యక్తి స్థానంలో ఇష్ట దైవాన్ని గానీ ... గురువును గాని మనసులో స్మరించుకుంటూ నమస్కరించాలి.

ఒక్క చేత్తో కాకుండా రెండు చేతులు వక్షస్థలం దగ్గర వుంచి మరీ నమస్కరించాలి. నమస్కారమనేది మనలోని విద్యని ... వినయాన్ని ... విధేయతని ... విజ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. అప్పుడే అవతలివారి అనుగ్రహం మనకి లభిస్తుంది. ధర్మరాజు ఆచరించిన ప్రణామం కారణంగానే అతనికి భీష్ముడి ఆశీస్సులు లభించాయి ... యుద్ధరంగాన విజేతగా నిలబెట్టాయి.

అలాగే వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడు ప్రణామములు అర్పించిన కారణంగానే ఆయనకి బ్రహ్మరుషి స్థానం లభించింది. శ్రీరాముడికి ప్రణామం చేయడం వల్లనే విభీషణుడికి చరిత్రలో గౌరవమైన స్థానం లభించింది. కనుక నమస్కారమనేది అత్యున్నతమైనదనీ ... దానిని ఆచరించడం వలన అత్యుత్తమమైన ఫలితాలు పొందవచ్చని పురాణాలు ... ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి.

More Bhakti Articles