పౌర్ణమి ప్రభావం

పౌర్ణమి ప్రభావం
భారతీయుల ఆధ్యాత్మిక జీవన ప్రయాణంలో 'పౌర్ణమి'కి ఎంతో ప్రత్యేకత వుంది ... మరెంతో విశిష్టత వుంది. శ్రావణ పౌర్ణమి ... కార్తీక పౌర్ణమి ... మాఘ పౌర్ణమి ... ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తాయి. ఇలా పండుగలను ... పర్వదినాలను సైతం పౌర్ణమి ప్రభావితం చేసింది. అసలు పౌర్ణమి కేంద్రం గానే తెలుగు మాసాలకు ఆ పేర్లు వచ్చాయి. పౌర్ణమి రోజున ఏ నక్షత్రమైతే వుంటుందో ... ఆ నెలకు ఆ నక్షత్రం పేరు పెట్టిన తీరు కనిపిస్తుంది.

ప్రతినెలా పౌర్ణమి వస్తుంది కాబట్టి, ఆ సమయంలో వున్న నక్షత్రాల పేర్లనే మాసాల పేర్లుగా మన పూర్వీకులు ఏర్పరిచిన విధానం ఆసక్తినీ ... ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చిత్తా నక్షత్రంలో పౌర్ణమి రావడం వలన చైత్ర మాసమనీ ... విశాఖ నక్షత్రంలో పౌర్ణమి రావడం వలన వైశాఖ మాసమని అంటారు. అలాగే జ్యేష్టా నక్షత్రం ... 'జ్యేష్ట మాసం'గా, పూర్వాషాడ నక్షత్రం ... 'ఆషాడ మాసం' గా, శ్రవణా నక్షత్రం ... 'శ్రావణ మాసం'గా పేర్కొన్నారు.

అలాగే పూర్వాభాద్ర నక్షత్రం ... 'భాద్రపద మాసం'గా, అశ్వినీ నక్షత్రం ... 'ఆశ్వీయుజ మాసం'గా, కృత్తికా నక్షత్రం 'కార్తీక మాసం'గా పిలవబడుతున్నాయి. ఇక మృగశిరా నక్షత్రం ... 'మార్గశిర మాసం'గా, పుష్యమి నక్షత్రం ... 'పుష్యమాసం' గా, ఫల్గుణీ నక్షత్రంలో పౌర్ణమి రావడం వలన 'ఫాల్గుణ మాసం'గా పేర్కొన్నారు.

More Bhakti Articles