తిరుమనం చేరీ

తిరుమనం చేరీ
లోకంలో సీతారాముల ... శివపార్వతుల కల్యాణాన్ని చూడని కళ్ళు వృధా అని అంటూ వుంటారు. అలా భక్తుల హృదయాలు పవిత్రం కావడానికీ ... వారి జీవితాలు ధన్యం కావడానికి శివ పార్వతులు వివాహం చేసుకున్న ప్రదేశమే 'తిరుమనం చేరీ'. తిరుమనం అనగా 'వివాహం' అని అర్థం. గర్భాలయంలో స్వామివారు ... అమ్మవారు పాణి గ్రహణ భంగిమలో కనిపిస్తారు.

ఆది దంపతులుగా లోకానికి ఆదర్శంగా నిలిచిన శివపార్వతుల కల్యాణానికి వేదికగా నిలిచిన ఈ క్షేత్రం, ఆధ్యాత్మిక ప్రపంచాన తన విశిష్టతను చాటుకుంటోంది. తమిళనాడు - కుట్టాలం సమీపంలో విరాజిల్లుతోన్న ఈ క్షేత్రంలో స్వామివారు కళ్యాణ సుందర్ గా ... అమ్మవారు కోకిలాంబళ్ గా భక్త జనకోటితో పూజలు అందుకుంటున్నారు.

ప్రాచీన కాలానికి చెందిన ఈ ఆలయాన్ని పునరుద్ధరించడంలో చోళరాణి ప్రముఖ పాత్రను పోషించినట్టు స్థల పురాణం చెబుతోంది. వివాహం విషయంలో ఆలస్యమైనవారు ఈ క్షేత్రాన్ని ఎక్కువగా దర్శిస్తూ వుంటారు. ఇక్కడి స్వామివారి అనుగ్రహంతో వివాహం జరిగిన వారు అనుకున్న మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

More Bhakti Articles