సామెతలో సందేశం

మనిషిని వివేకవంతునిగా తయారుచేయడంలోను ... చైతన్య వంతునిగా ముందుకు నడిపించడంలోను సామెతలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి. మాటల సందర్భంలో విషయాన్ని బట్టి వీటి ప్రస్తావన వస్తుంటుంది. చాలామంది సన్నిహితులు తమ తోటివారి మంచిని కోరుకునే సందర్భంలో ''అలిగి అత్తవారింటికి ... చెడి చెల్లెలు ఇంటికి వెళ్లకూడదు''అని చెబుతుంటారు. వినడానికి ఇదేదో బాగానే వుందని పిస్తుంది కానీ ... అనుభవంలో నుంచి పుట్టిన ఈ మాట ఆచరించే వారి గౌరవాన్ని కాపాడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సాధారణంగా అల్లుడు అత్తవారింటి నుంచి గౌరవాన్ని ఆశిస్తాడు. అయితే అతను పండుగలకు పబ్బాలకు వస్తే ఎవరైనా గౌరవిస్తారు గానీ, ఇల్లరికం ఉండటానికి వస్తే మాత్రం ఎంతమాత్రం పట్టించుకోరు. ''రోజూ చచ్చేవాడి కోసం ఎవరు ఏడుస్తారు ... రోజూ వచ్చే వాడి కోసం ఎవరు ఎదురు చూస్తారు''అనే సామెతను అత్తింటివారు ఆచారణలో పెడుతుంటారు. ఈ కారణంగా ఆత్మాభిమానం దెబ్బతినడం ... అత్తమామల మీద కోపం దంపతుల మధ్య గొడవలుగా మారడం జరుగుతూ వుంటుంది.

ఇక చెడి చెల్లెలి ఇంటికి వెళ్లినా ఇదే విధంగా చులకన కావడం జరుగుతూ వుంటుంది. ఆడపిల్లకి సాయం చేయడానికి వెళితే అక్కడి వారు మర్యాదగా చూస్తారు. ఆమె సాయం కోరి అక్కడ తిష్టవేస్తే అవమానాలు ఎదురవుతూ వుంటాయి. సోదరుడిని తన అత్తింటి వారు చులకనగా చూడటం వలన ఆడపిల్ల మనసు నొచ్చుకుంటుంది. ఆ ప్రభావం ఆమె కాపురంపై పడటం ... కలతలు రావడం జరుగుతుంటాయి. అందువల్లనే పూర్వీకులు తమ అనుభవ సారాన్ని సామెతలుగా మలచి మనకి అందించారు. వాటిని ఆచరించడమంటే జీవితాన్ని తీర్చి దిద్దుకోవడంగానే భావించాలి.

More Bhakti Articles