వస్త్ర ధారణ

వస్త్ర ధారణ
దేవాలయంలో ప్రవేశించినది మొదలు ... అక్కడి నుంచి బయటికి వచ్చేంత వరకూ దృష్టి దేవుడిపైనే వుండాలి. దైవాన్ని స్మరిస్తూ ఆయన దర్శనం కోసం ఉవ్విళ్ళూరుతూ వుండాలి. ఈ నేపథ్యంలో భక్తులు ధరించే వస్త్రాలు సంప్రదాయ బద్ధంగా వుండాలనే ఆచారాన్ని కూడా మనం చూస్తుంటాం. దైవ దర్శన సమయంలో స్త్రీలు సంప్రదాయ బద్ధమైన వస్త్రాలను నిండుగా ధరించాలనీ, ఇక పురుషులు మాత్రం ఛాతి భాగం కనిపించేలా పలుచని వస్త్రాలు ధరించాలని పెద్దలు చెబుతుంటారు. ఈ ఆచారాన్ని చాలా దేవాలయాలు పాటిస్తూ వుండటం గమనించదగిన విషయం. ఈ విధమైన ఆచారం వెనుక అసలైన అర్థం లేకపోలేదు.

పురుషులు నడుము పైభాగాన వస్త్రాన్ని ధరించకుండా ఆలయంలోని విగ్రహం దగ్గరకి వెళ్లి ఆ స్వామి కృప తమకి లభించాలని ప్రార్ధిస్తారు. ఫలితంగా వాళ్ల మనసు పవిత్రమై ప్రశాంతతను ప్రసాదిస్తుంది. దైవం తమకి తోడుగా వున్నాడనే మానసిక భావన వాళ్లకి ఎంతో శక్తిని ఇస్తుంది. అలాగే పురుషులు దేవుడి విగ్రహానికి దగ్గరగా వెళ్లినప్పుడు ఆ విగ్రహంలోని వివిధ భాగాల నుంచి వెలువడే కొన్ని శక్తి కిరణాలు వాళ్ల శరీరంలో ప్రవేశిస్తాయి. వాళ్లని వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయి.

సూర్యోదయ సమయంలో సూర్యనమస్కారాలు చేయడం వలన 'డి' విటమిన్ ఎలా లభిస్తుందో, అలాగే పురుషులు నడుము పై భాగాన వస్త్రం ధరించక దైవ దర్శనం చేసుకోవడం వలన కూడా అలాంటి శక్తే నేరుగా లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. సంప్రదాయ బద్ధమైన వస్త్రాలతో దైవదర్శనం చేయడం వలన ఎలాంటి ఆకర్షణలకు తావులేకుండా పోవడమే కాకుండా, పైన తెలిపిన ఆరోగ్య రహస్యం కూడా ఈ ఆచారంలో అంతర్లీనంగా కనిపిస్తూ వుంటుంది.

More Bhakti Articles