గోత్రాల పుట్టుక

గోత్రాల పుట్టుక
సాధారణంగా పూజ చేసుకునేటప్పుడు సంకల్పంలో గోత్రనామాలు చెప్పుకోవడం ... గుడిలో అర్చన సమయంలో పూజారికి గోత్ర నామాలు చెప్పడం జరుగుతూ వుంటుంది. ఇక వివాహ పరంగా ఒక ఇంటికి పిల్లను ఇవ్వాలన్నా ... ఒక ఇంటి నుంచి పిల్లను తెచ్చుకోవాలన్నా గోత్రాలు ప్రధాన పాత్రను పోషిస్తుంటాయి. ఒకే గోత్రానికి సంబంధించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావించడం జరుగుతోంది. ఈ కారణంగానే సగోత్రికులకు పిల్లను ఇవ్వడం గానీ ... తెచ్చుకోవడం గాని చేయరు.

ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ గోత్రాలు ఎలా పుట్టుకొచ్చాయనే ఆలోచన కలుగుతూ వుంటుంది. పూర్వం కాలంలో పాడిపంటలు జీవన విధానాన్ని నిర్దేశించాయి. ఇక పంటలు లేని వాళ్లు ఉండేవారేమో గానీ ... పాడి లేని వారు మాత్రం వుండేవారు కాదు. ఇలా పాడి వున్న వారంతా బృందాలుగా వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లేవారు. అలాంటి సమయంలో ఒకరి గోవులు మరొకరి గోవుల బృందంలో కలిసి పోకుండా ఒక్కో బృందం ఒక్కో పేరు పెట్టుకునేది. దానిని బట్టి ఒకవేళ గోవులు తప్పిపోయినా అది ఫలానావారి బృందంలోనిది అని తెలిసేది.

ఆ తరువాత కాలంలో గోవుల బృందాలకి చెందిన పేర్లే గోత్రాలుగా మారిపోయాయి. ఇక కొందరు మహర్షులను ఈ గోత్రాలకు మూలపురుషులుగా భావించి కొలిచే సంప్రదాయం ఈనాటికీ మనకి కనిపిస్తూనే వుంటుంది. ఏదేవైనా గోవుల సంరక్షణ కోసం ఏర్పాటు చేయబడిన గోత్రాలు ... ఆధునిక కాలంలోనూ ప్రాముఖ్యతను సంతరించుకుని ఆచరణలో ఉండటాన్ని నిజంగా ఓ విశేషంగానే చెప్పుకోవాలి.

More Bhakti Articles