ఆషాఢ మాసం

కొత్తగా పెళ్లైనవారు ఆషాఢ మాసాన్ని ఓ శాపంలా భావిస్తుంటారు. భార్యా భర్తలను విడదీసే ఈ మాసంపట్ల అయిష్టతని ... అసహనాన్ని వ్యక్తం చేస్తుంటారు. సహజంగానే కొత్తగా పెళ్లైనవారికి ఎన్నో ఆశలు ... మరెన్నో కోరికలు ఉంటూ వుంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆషాడం పేరు చెప్పి కొత్త దంపతులను విడదీయడం వారికి కాస్త చిరాకును కలిగిస్తూ వుంటుంది.

నిజానికి ఆషాఢ మాసంలో కొత్త దంపతులు కలిసి కాపురం చేయడం వలన కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. ఈ మాసంలో గర్భం ధరించిన స్త్రీలకి వేసవి కాలంలో ప్రసవం జరుగుతుంది. వేసవి కాలంలో ప్రసవం అటు తల్లికీ ... ఇటు బిడ్డకి కూడా అంత మంచిదికాదు కాబట్టి పెద్దలు ఈ ఆచారాన్ని వెలుగులోకి తెచ్చారని చెప్పుకోవచ్చు.

ఈ కారణంగానే తమ కూతురు ఆషాఢ మాసంలో అత్త గారింట్లో ఉండకూడదని చెప్పేసి, తల్లిదండ్రులు ఆమెని పుట్టింటికి తీసుకుపోతుంటారు. అయితే అసలు సంగతి తెలియని చాలామంది ... అత్త గారితో కలిసి వుండకూడదని భావించి, భార్యా భర్తలను వేరుగా ఉంచుతుంటారు. ఆషాఢ మాసంలో అత్త - కోడలు ఒకే గడపను దాటకూడదు అని పెట్టుకున్న నియమాన్ని కూడా చాలామంది మరో రకంగా అర్ధం చేసుకున్నారు. అత్తా కోడళ్లు ఒకే గడప దాటకూడదని చెప్పారు కాబట్టి, ఎవరినో ఒకరిని గడప అవతల దింపడం చేస్తున్నారు.

పెద్దలమాట చద్దిమూట అన్నారు కాబట్టి మన క్షేమాన్ని ఆశించి వారు చెప్పిన మాటలను ఆచరించాలి. అంతేగానీ ఆచారాలను తమకి అనుకూలంగా సడలించుకుంటే అందుకు తగిన ప్రతిఫలాన్ని పొందక తప్పదనే విషయాన్ని గ్రహించాలి.

More Bhakti Articles