ఇష్టంగా ఆరాధిస్తే కష్టాలు తీర్చే ఈశ్వరుడు

దేవతలు మనోభీష్టం నెరవేరడానికిగాను అనేక ప్రదేశాల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు ... ఆ స్వామి అనుగ్రహాన్ని అందుకున్నారు. అలాగే మహర్షులు సైతం వివిధ ప్రాంతలలో పర్యటిస్తూ పవిత్రమైన ప్రదేశాల్లో పరమశివుడిని ప్రతిష్ఠించి జపతపాలు కొనసాగించారు.

ఇక ఎంతోమంది రాజులు సదాశివుడిని తమ ఇలవేల్పుగా భావించి ఆరాధించారు. అందుకు నిదర్శనంగా వాళ్లు నిర్మించిన ఆలయాలు ... అభివృద్ధి పరచిన ఆలయాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఇలా పౌరాణికి నేపథ్యాన్ని ... చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న శివాలయం మనకి 'వెల్లటూరు' లో కనిపిస్తుంది.

నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. ప్రాచీన వైభవానికి ప్రతీకగా కనిపించే ఈ ఆలయానికి ప్రతి సోమవారంతో పాటు పర్వదినాల్లోను ... కార్తీకమాసంలోను భక్తులు ఎక్కువగా వస్తుంటారు. నియమనిష్టలను పాటిస్తూ స్వామివారికి పూజాభిషేకాలు జరిపిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో చేసే దీపారాధన వలన సమస్త పాపాలు నశించి, సకలశుభాలు కలుగుతాయని భావిస్తూ ఉంటారు.

ఇక్కడి స్వామివారితో భక్తులకు విడదీయరాని అనుబంధం ఉంది. ఆ స్వామి అనుగ్రహం కారణంగానే తమ జీవితం సుఖశాంతులతో సాగిపోతుందని చెబుతుంటారు. ఈ క్షేత్రంలో అడుగుపెట్టడంతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందనీ, మహాదేవుడి ఆశీస్సులు లభించగానే సమస్యలు మటుమాయమై పోతాయని విశ్వసిస్తుంటారు. స్వామివారికి జరిపే ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ కృతజ్ఞతలు తెలుపుతుంటారు.


More Bhakti News