ప్రతిమలు - పూజలు

ప్రతిమలు - పూజలు
సాధారణంగా పూజల విషయంలోను ... వాటిని ఆచరించే పద్ధతుల్లోను ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. కొందరు ఎక్కువసేపు పూజ చేస్తూ తమకి ఎక్కువ భక్తి వున్నట్టుగా చెప్పుకుంటూ ఉంటారు. మరికొందరు పెద్ద విగ్రహాలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంటినే చిన్నపాటి దేవాలయంగా మార్చేస్తుంటారు. ఇంకొందరు తమ ఇష్టదైవాల చిత్రపటాలు చాలా పెద్దవి తెచ్చి పెడుతుంటారు.

ఇక ఆ ఇంటికి వచ్చిన వారు ఎవరైనా ''అంత పెద్ద విగ్రహాలు ఇంట్లో ఉండకూడదు'' అని ఒక మాట అంటే చాలు ... ఇక వాటిని ఎలా వదిలించుకోవాలో తెలియక నానా ఇబ్బందులు పడతారు. అందుకే శాస్త్రం తెలుసుకుని గానీ ... తెలిసిన వారిని కనుక్కుని గాని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. పూజా మందిరంలో పెట్టి పూజించుకునే విగ్రహం ఎప్పుడూ కూడా మణికట్టు నుంచి చిటికెన వేలు చివరి వరకు మాత్రమే ఉండాలి. విగ్రహం అంతకన్నా పొడవుగా వుంటే నిత్య నైవేద్యాలు ఉండాల్సిందే. అలాగే అశుచిగా వుండే సమయంలో పూజా మందిరం వైపు వెళ్లకుండా నియమనిష్టలను పాటించాలి.

ఇక విగ్రహం పరిమాణం ఎంతైనా ప్రాణ ప్రతిష్ఠ చేసుకుని పూజించాలి. అలా ప్రాణ ప్రతిష్ఠ గనక చేయకపోతే అది ఓ అలంకార వస్తువే అవుతుంది. దేవుడి విగ్రహాలు అలంకార ప్రాయంగా ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. ఇక ఇంట్లో సీతాసమేతంగా లేని శ్రీరాముడు ... రాధలేని కృష్ణుడు ... ఐదు తలల నాగేంద్రుడు ... గీతోపదేశం ... చిత్ర పటాలు ఉండకూడదని చాలా మంది అపోహ పడుతుంటారు. దగ్గరలోని దేవాలయానికి తీసుకువెళ్లి తాము కొన్న చిత్ర పటాలను అక్కడ పెట్టేసి వస్తుంటారు.

నిజానికి ఇందులో ఎలాంటి దోషంలేదు. అయ్యవారు ఒక్కడే మూలమూర్తిగా కనిపించే పుణ్య క్షేత్రాలు ఎన్నో వున్నాయి. అలాగే అమ్మవారు మాత్రమే కొలువైన క్షేత్రాలు వున్నాయి. దైవంపట్ల విశ్వాసం ... ఆయన సూచించిన మార్గంలో నడవాలనే ఆరాటం వుండాలి. ఇక గీతోపదేశం ఫోటో ఇంట్లో వుంటే ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటామనే ఆలోచన కూడా సరికాదు. సఖ్యతకి మించిన సౌఖ్యం లేదనే విషయాన్ని దాని నుంచి మనం గ్రహించాలి.

More Bhakti Articles