రక్షాబంధనంలోని ఆంతర్యం ఇదే !

ఏడాదిలో పలకరించే పన్నెండు పౌర్ణమిలలో 'శ్రావణపౌర్ణమి'కి ఎంతో ప్రత్యేకత వుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అద్దంపట్టే 'రక్షాబంధనం' పండుగను ఈ రోజున జరుపుకుంటూ వుంటారు. పూర్వం దేవేంద్రుడి క్షేమాన్ని ... ఆయన విజయాన్ని ఆశించి శచీదేవి ఆయనకి 'రక్ష' కడుతుంది. ఆనాటి నుంచి మొదలైన ఈ సంప్రదాయం ఓ పండుగ రూపాన్ని సంతరించుకుని అన్నాచెల్లెళ్లు ... అక్కాతమ్ముళ్ల వరకే పరిమితమై వాళ్ల అనుబంధానికి గుర్తుగా నిలిచింది.

అమ్మానాన్నల తరువాత ఆడపిల్ల బాగోగులు చూసేది సోదరుడే. అత్తగారింట్లో వున్న సోదరికి కష్టంవస్తే అండగా నిలిచేది ... ఆదుకునేది సోదరుడే. అందుకే ఆడపిల్ల వివాహ సందర్భం నుంచి ఆమెకి జన్మించిన ఆడపిల్ల వివాహం వరకూ ఆయా వేడుకల్లో సోదరుడి పాత్ర ఉండేలా పెద్దలు ఆచారవ్యవహారాలను ఏర్పరిచారు.

అలా తనని నీడలా కనిపెట్టుకుని వుండే సోదరుడు క్షేమంగా వుండాలి. అతను ఎప్పుడూ ఆరోగ్యంగా ... ఆనందంగా ... సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. ఈ విషయంలో అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ రక్షాబంధనం కడుతుంది. సోదరి కుటుంబం పట్ల తన కర్తవ్యాన్ని ఎప్పటికీ నిర్వర్తిస్తూ ఉంటాననే విశ్వాసాన్ని సోదరుడు ఆమెకి కలిగిస్తాడు.

ఒకవేళ ఏదైనా పని వత్తిడిలో పడిపోయి సోదరి క్షేమాన్ని కొంతకాలంపాటు తెలుసుకోలేకపోతే, ఏదో ఒక సమయంలో తన చేతికి కట్టబడిన రక్ష అతనికి సోదరిని గుర్తుచేస్తుంది. వెంటనే అటు వైపు మనసులాగడంతో వెళ్లిరావడం చేస్తుంటారు. ఆడపిల్ల లేకపోతే అనురాగం ... ఆప్యాయత ... సంతోషమనే సందడి ఉండేవి కావేమోననే విషయం ఈ పండుగ రోజున అనిపిస్తూ వుంటుంది.

సాధారణంగా పండుగలలో ఆప్యాతానురాగాలు వెదజల్లబడుతూ వుంటాయి. కానీ అన్నాచెల్లెళ్లు ... అక్కాతమ్ముళ్ల మధ్య ఆవిష్కరించబడే ప్రేమనురాగాలనే ఒక పండుగలా జరుపుకునే విశేషమైన రోజుగా శ్రావణ పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తూ వుంటుంది ... అదే ఈ పండుగ పరమార్థంగా అనిపిస్తూ వుంటుంది.


More Bhakti News