ఈ ఊరు పేరు వెనుక కథ ఇదే !

కొన్ని ఊళ్లపేర్లు వినగానే ఆ ఊరుకి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. గ్రామాలకు వుండే పేర్లు చాలావరకూ అక్కడి ఆధ్యాత్మిక నేపథ్యం కారణంగా పుట్టినవిగా కనిపిస్తూ వుంటాయి. ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాలకు అక్కడి దేవుడును బట్టి ... మరికొన్ని గ్రామాలకు అక్కడి భక్తులను బట్టి పేర్లు ఏర్పడినట్టుగా స్థలపురాణాన్ని బట్టి తెలుస్తూవుంటుంది.

అలా ఓ భక్తుడి పేరుతో ఏర్పడిన ఊరుగా 'ఓదెల' కనిపిస్తుంది. కరీంనగర్ జిల్లా పరిధిలో గల ఈ ఊళ్లో ప్రసిద్ధి చెందినటువంటి మల్లికార్జునస్వామి ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. ఇక్కడి స్వామి 'ఓదేలు' అనే వ్యక్తి కారణంగా వెలుగు చూసినట్టు స్థలపురాణం చెబుతోంది. ఆసక్తికరమైన ఆ సంఘటన చాలాకాలం క్రిందట ఈ ఊళ్లో జరిగింది.

ఈ ఊరికి చెందిన 'ఓదేలు' అనే రైతు ఒక రోజున తన పొలాన్ని దున్నడం మొదలుపెడతాడు. అలా దున్నుతూ వుండగా హఠాత్తుగా ఒకచోట ఎద్దులు ఆగిపోతాయి. నాగలికి ఏదో తట్టుకుని ఆగిపోయి ఉంటుందని భావించిన ఆయన, వాటిని గట్టిగా అదిలిస్తాడు. ఎద్దులు ఒక్క ఊపుతో ముందుకు వెళ్లడంతో నాగలికి తట్టుకున్న శివలింగం ఒక్కసారిగా పైకి వస్తుంది. అదే క్షణంలో స్వామివారు ప్రత్యక్షమై అతని ధోరణి పట్ల అసహనాన్ని ప్రదర్శించగా, తన అజ్ఞానాన్ని మన్నించమంటూ ఓదేలు ప్రాధేయపడతాడు. దాంతో స్వామి అనుగ్రహించి అదృశ్యమయ్యాడట.

ఓదేలు ద్వారా ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, స్వామివారికి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ఆనాటి నుంచి ఇక్కడి మల్లికార్జునుడు భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నాడు. స్వయంభువు శివలింగం వెలుగులోకి రావడానికి ఓదేలు కారణమైనందున ... ఆ స్వామి దర్శన భాగ్యాన్ని పొందినందు వలన ఆయన పేరే .. ఆ ఊరు పేరుగా మారిపోయింది. కాలక్రమంలో అది 'ఓదెల'గా మార్పుచెందిందని చెబుతుంటారు.


More Bhakti News