నడిచొచ్చిన నరసింహస్వామి

పుణ్యక్షేత్రాలకి వెళ్లిన వాళ్లు ముందుగా అక్కడి దివ్యతీర్థంలో స్నానమాచరిస్తుంటారు. లేదంటే తలపై ఆ తీర్థాన్ని చల్లుకుని దైవదర్శనం చేసుకుంటూ వుంటారు. సాధారణంగా పుణ్యక్షేత్రాలు స్వయంభువుమూర్తితో స్థల మహాత్మ్యాన్ని సంతరించుకుని వుంటాయి. ఇక అక్కడి తీర్థాలు దైవ సంకల్పం కారణంగా ఏర్పడినవై వుంటాయి.

అలా స్వయంభువుమూర్తితోను ... దైవ సంకల్పం కారణంగా ఏర్పడిన దివ్యతీర్థంతోను అలరారుతోన్న క్షేత్రం మనకు 'జాన్కంపేట'లో కనిపిస్తుంది. అనేక విశేషాలతో అలరారుతోన్న ఈ క్షేత్రం నిజామాబాద్ జిల్లాలో దర్శనమిస్తోంది. హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం స్వామి ఉగ్రమూర్తిగానే తిరుగుతూ ఈ ప్రదేశానికి వచ్చాడట.

స్వామి గర్జనలకు అడవంతా మారుమోగిపోతూ వుండగా, మహర్షులు ... మునులు అక్కడికి చేరుకున్నారు. ఉగ్రరూపంలో వున్న స్వామివారిని శాంతింపజేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో, మార్గం చూపమని ఆ స్వామివారినే వేడుకున్నారు. ఆ స్వామి చెప్పిన ప్రకారం చేసి ఆయనను శాంతింపజేశారు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ పుష్కరిణి ఏర్పడినట్టు స్థలపురాణం చెబుతోంది.

ఆనాటి నుంచి స్వామివారు లక్ష్మీదేవి సమేతుడై శాంతమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తూ వుంటాడు. ఇక ఇదే ప్రాంగణంలో పరమశివుడు కూడా కొలువుదీరిన కారణంగా ఇది శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతోంది. హరుహరుల నెలవైన కారణంగా ... పవిత్ర పుష్కరిణి ఆవిర్భవించిన కారణంగా ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా చెప్పబడుతోంది.

అలాంటి ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం వల్లనే అనేక పాపాలు ... దోషాలు నశిస్తాయనీ, సుఖశాంతులు లభిస్తాయని భక్తులు చెబుతుంటారు. సువిశాలమైన ప్రదేశంలో ప్రాచీన వైభవాన్ని సంతరించుకుని విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, పర్వదినాల్లో భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటుంది. ఎంతోమంది ఇక్కడి లక్ష్మీనరసింహుడిని తమ ఇలవేల్పుగా కొలుస్తుంటారు. కనులారా దర్శించుకుంటూ ... కానుకలు సమర్పించుకుంటూ తరిస్తుంటారు.


More Bhakti News