దుష్టశక్తుల నుంచి విముక్తి కలిగించే దివ్య క్షేత్రం

నృసింహస్వామి స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు ... హనుమంతుడు అవతరించిన క్షేత్రాలు అత్యంత శక్తిమంతమైనవిగా చెప్పబడుతున్నాయి. నృసింహస్వామి ... హనుమంతుడు 'యోగముద్ర'లో వెలసిన క్షేత్రాలు మరింత విశిష్టమైనవిగా విలసిల్లుతున్నాయి. ఆ ఇద్దరూ చెరో కొండపై కొలువుదీరిన అరుదైన క్షేత్రం మనకి 'తిరు ఘటిగై'లో దర్శనమిస్తోంది.

'తిరుఘటిగై'ని చోళసింహాపురం ... చోళంగిపురంగా కూడా పిలుస్తుంటారు. తమిళనాడు - అరక్కోణం సమీపంలో అలరారుతోన్న ఈ క్షేత్రం, అటు పురాణ నేపథ్యాన్ని .... ఇటు చారిత్రక వైభవాన్ని సంతరించుకుని కనిపిస్తుంది. యోగ నృసింహస్వామి - అమృతవల్లి తాయారు కొలువైన పెద్దకొండ 'గరుడపక్షి' ని పోలి వుంటుంది. గరుడపక్షి వీపు భాగంపై ఆలయం దర్శనమిస్తూ వుంటుంది. దివ్యమైన ఈ దృశ్యం ఆశ్చర్యచకితులను చేస్తుంది.

ఇక చిన్నకొండపై యోగ హనుమంతుడు దర్శనమిస్తూ వుంటాడు. ఇక్కడ హనుమంతుడు చతుర్భుజాలనుకలిగి, శంఖుచక్రాలను ధరించి దర్శనమిస్తూ వుండటం విశేషంగా చెబుతారు. మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో 'అమృత తీర్థం' ... 'నృసింహ తీర్థం' ... ' హనుమాన్ తీర్థం' ... ' బ్రహ్మతీర్థం' దర్శనమిస్తాయి. ఒక్కో తీర్థం ఒక్కో ప్రత్యేకతను కలిగి ఉన్నట్టుగా స్థలపురాణాన్నిబట్టి తెలుస్తోంది.

సాధారణంగా గ్రహపీడలతో ... దుష్టశక్తుల కారణంగా బాధలు పడుతోన్నవాళ్లు నృసింహస్వామి క్షేత్రాలను గానీ, హనుమంతుడి ఆలయాలను గాని దర్శ్జించుకుంటూ వుంటారు. అలాంటిది నృసింహస్వామి ... హనుమంతుడు ఇక్కడే చెరో కొండపై ఆవిర్భవించడం వలన, ఈ క్షేత్రం మరింత విశిష్టతను సొంతం చేసుకుంది. అందువలన దుష్టగ్రహ పీడితులు, దుష్ట శక్తుల బాధితులు ఇక్కడికి పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ క్షేత్రాన్ని దర్శించి ... తీర్థాలను సేవించి, దీర్ఘవ్యాధుల నుంచి ... దుష్ట శక్తుల నుంచి విముక్తిని పొందుతుంటారు.


More Bhakti News