నిజమైన భక్తి నిలిచిన వేళ

దేవుడనే వాడే లేడు ... ఎవరి కష్టం వాళ్లని కాపాడుతుందనే ఒక మొండి వైఖరితో వున్న మంజునాథుడుకి ఓ అనూహ్యమైన సంఘటనతో జ్ఞానోదయం కలుగుతుంది. దాంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి శివారాధన చేయడం ప్రారంభిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే, ఆ ప్రాంతాన్ని పాలిస్తోన్న అంబికేశ్వర మహారాజు 'ధర్మస్థల'ను దర్శించడానికి వస్తాడు.

తానురాసిన కాలజ్ఞాన రచనను శివుడికి సమర్పించడం కోసం ఆయన ప్రయత్నిస్తూ వుండగా, మంజునాథుడు అక్కడికి వస్తాడు. అదే సమయంలో ఒక్కసారిగా విపరీతమైన గాలిరావడంతో ఆలయ మంటపంలోని దీపాలన్నీ కొండెక్కుతాయి. ఊహించని ఈ సంఘటనకి అంబికేశ్వర మహారాజు ఆలోచనలోపడతాడు. నాస్తికుడైన మంజునాథుడు భక్తి పరుడిగా నాటకాలు ఆడుతున్నాడనీ, ఆయన రావడం వల్లనే గుడిలో దీపాలు ఆరిపోయాయని కొందరు మహారాజు చెవిన వేస్తారు. దాంతో ఆలయ సిబ్బంది మంజునాథుడు లోపలికి రాకుండా అడ్డుకుంటారు.

గతంలో తాను శివనింద చేసిన మాట నిజమేననీ, ఆ తరువాత ఆయన పట్ల అనురాగాన్ని కలిగి వున్నానని చెబుతాడు మంజునాథుడు. తనకి స్వామి వారి దర్శన భాగ్యం కలిగించమని కోరతాడు. ఆరిపోయిన దీపాలు భక్తితో వెలిగించి చూపమనీ, అలా జరిగితే అతణ్ణి ఆలయంలోకి అనుమతిస్తామని చెబుతాడు మహారాజు. దాంతో తన పరిస్థితిని స్వామికి మనవి చేసుకుంటూ మంజునాథుడు కన్నీళ్ల పర్యంతమవుతాడు. దర్శన భాగ్యాన్ని ప్రసాదించమంటూ, ఆ స్వామిని చూడటం కోసం తన మనసు ఎంతగా ఆరాటపడుతున్నది తెలియజేస్తాడు.

అంతే అందరూ చూస్తుండగానే అక్కడి దీపాలు వాటంతటవే వెలుగుతాయి. మహారాజుతో సహా ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోతారు. అసమానమైన మంజునాథుడి భక్తిని మహారాజు ప్రశంసిస్తూ ఆలింగనం చేసుకుంటాడు. ఆలయ మర్యాదలతో మంజునాథుడికి స్వామి దర్శన భాగ్యం కలిగించమని ఆదేశిస్తాడు. ఈ సంఘటనతో అక్కడి ప్రజలు మంజునాథుడిని ఒక మహా భక్తుడిగా గుర్తించి గౌరవించడం మొదలుపెడతారు.


More Bhakti News