Revanth Reddy: ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటున్నారు... నేను అల్లాటప్పాగా రాలేదు: రేవంత్ రెడ్డి

  • పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్ మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని మండిపాటు
  • అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌లో మార్పు వస్తుందని భావించామన్న ముఖ్యమంత్రి
  • రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాత ఓట్లు అడుగుతారని  భావించామని వ్యాఖ్య
  • తెలంగాణకు మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శ
Revanth Reddy warns BRS chief KCR

అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే తమ ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటున్నారని... కానీ సీఎం పదవి నుంచి దిగిపోవడానికి తాను అల్లాటప్పాగా రాలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమం పేరు చెప్పి పిల్లలను చంపి తానేమీ పదవిలోకి రాలేదని ఎత్తిపొడిచారు. 

మంగళవారం నాడు హన్మకొండలో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పదేళ్లు విధ్వంసం సృష్టించిన కేసీఆర్ మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌లో మార్పు వస్తుందని భావించామని... రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాత ఓట్లు అడుగుతారని భావించామని... కానీ అదేమీ జరగలేదన్నారు. పైగా మూడు నెలలకే తమ ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. విభజన చట్టంలోనే యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు భారీ పరిశ్రమలు ఇచ్చిందని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని నిర్మించాలని చెప్పిందని, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పిందని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ప్రాజెక్టును కూడా యూపీఏ ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెప్పారు. కానీ విభజన చట్టంలోని హామీలను మోదీ ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులను మోదీ గుజరాత్‌కు తరలించారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News