ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా... 'సితారే జమీన్ పర్'పై సుధా మూర్తి ప్ర‌శంస‌లు

  • ఆమిర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో 'సితారే జమీన్ పర్' 
  • సమాజంలో పెను మార్పులు తెస్తుందన్న సుధా మూర్తి 
  • ఈ నెల‌ 20న ప్రేక్ష‌కుల ముందుకు మూవీ
  • సుధా మూర్తి వ్యాఖ్యలతో పెరిగిన సినిమా క్రేజ్
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధా మూర్తి, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ రాబోయే చిత్రం 'సితారే జమీన్ పర్' పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ చిత్రం తన ఆలోచనలను మార్చేసిందని, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా సమాజంలో పెను మార్పులు తీసుకురాగలదని ఆమె అభిప్రాయపడ్డారు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల కోసం ప్ర‌త్యేక ప్రీమియ‌ర్‌ను ప్రద‌ర్శించారు మేక‌ర్స్. ఈ ప్రీమియ‌ర్‌లో సుధా మూర్తి కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమా చూసిన అనంత‌రం సుధా మూర్తి భావోద్వేగానికి లోన‌య్యారు.

ఈ సినిమా చూసిన తర్వాత సుధా మూర్తి మాట్లాడుతూ... “ఈ సినిమా చూస్తుంటే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇది కేవలం ఒక సినిమా కాదు, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అనుభవం. మానసిక వికలాంగులుగా బాధ‌ప‌డుతున్న పిల్లలను మనం ఎలా అర్థం చేసుకోవాలి, వారికి ఎలా మద్దతు ఇవ్వాలి అనే దానిపై ఈ చిత్రం అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

"ఈ సినిమా స‌మాజంలో చాలా మార్పు తీసుకురాగలదు" అని సుధా మూర్తి పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో సినిమా విడుదలకు ముందే ప్రేక్షకుల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. చలనచిత్ర పరిశ్రమకు చెందని ఓ ప్రముఖ వ్యక్తి నుంచి ఇలాంటి సానుకూల స్పందన రావడం, సినిమా కథాంశం ప్రాముఖ్యతను, దాని విశ్వసనీయతను తెలియజేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆమిర్‌ గత చిత్రాల తరహాలోనే ఈ సినిమా కూడా సామాజిక స్పృహ కలిగిన ఇతివృత్తంతో రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల ఆదరణ కూడా పొందగల చిత్రంగా దీనిపై అంచనాలున్నాయి. సినిమాను థియేటర్లలోనే చూడాలని, పైరసీని ప్రోత్సహించవద్దని ఆమిర్ ఖాన్ ఇప్పటికే ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. 

ఇక‌, ఈ సినిమాకు ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహించ‌గా.. జెనీలియా కథానాయికగా నటించారు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆమిర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 


More Telugu News