Harish Rao: ఇది ముమ్మాటికీ కుట్రే... సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడిన హరీశ్ రావు

Harish Rao Fires at CM Revanth Reddy Over Conspiracy Allegations
  • రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
  • నల్లమల సాగర్ విషయంలో ఏపీకి మేలు చేస్తున్నారని విమర్శలు
  • ఉమ్మడి కమిటీ ఏర్పాటులో తెలంగాణకు నష్టం జరిగిందని వ్యాఖ్య
  • టెండర్ ప్రక్రియ తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లడంపై అనుమానాలు
  • ఇది తెలంగాణకు చేసిన ద్రోహమేనని హరీశ్ రావు ఆరోపణ
నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. బనకచర్ల ముప్పును ముందుగా పసిగట్టింది బీఆర్ఎస్ పార్టీయేనని, తాము ‘ముల్లుకర్ర’తో కాదు ‘బల్లెం’తో పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేవలేదని ఆయన ధ్వజమెత్తారు. అనేక ప్రెస్ మీట్లు పెట్టి హెచ్చరించినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు.

తమ పోరాటాల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణతో సమావేశం ఏర్పాటు చేసిందని హరీశ్ రావు తెలిపారు. "మేము వద్దని ఎంతగా వారించినా రేవంత్ రెడ్డి ఢిల్లీ సమావేశానికి వెళ్లారు. బనకచర్ల అంశం ఎజెండాలో లేదని మొదట బుకాయించారు. కానీ, మేము ఎజెండాను బయటపెట్టి వాస్తవాలను బట్టబయలు చేశాం. ఆ తర్వాత ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా బనకచర్లపై చర్చ జరిగిందని, కమిటీ వేశారని చెప్పడంతో రేవంత్ రెడ్డి అబద్ధం బట్టబయలైంది" అని హరీశ్ వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వాటాను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు.

2025 జూలై 16న రేవంత్, చంద్రబాబు మధ్య కుదిరిన అంగీకారం ప్రకారమే నీటి వాటాల పంపిణీకి కేంద్ర జలశక్తి శాఖ కమిటీని ఖరారు చేసిందని హరీశ్ రావు పేర్కొన్నారు. 

"ఈ కమిటీ ఏర్పాటులోనూ తెలంగాణకు అన్యాయం జరిగింది. ఏపీ కమిటీలో ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు అనుభవజ్ఞులైన ఇంజినీర్లు ఉంటే, తెలంగాణ కమిటీలో ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక్క ఇంజినీరింగ్ అధికారినే నియమించారు. మన రాష్ట్రం తరఫున నీటిపారుదల రంగంలో అనుభవం లేని అధికారిని నియమించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

మూడు నెలల్లో నీటి పంపకాలు పూర్తి చేయడమంటే.. నల్లమల సాగర్‌కు ఆమోదముద్ర వేయడమేనని, ఇది ఉద్దేశపూర్వకంగా ఏపీకి మేలు చేసే చర్యేనని విమర్శించారు.

ఏపీ ప్రభుత్వం 2025 డిసెంబర్ 11న టెండర్లకు చివరి తేదీ ప్రకటిస్తే, తెలంగాణ ప్రభుత్వం గడువు ముగిసిన తర్వాత డిసెంబర్ 16న సుప్రీంకోర్టుకు వెళ్లడమే రేవంత్ రెడ్డి కుట్రకు నిదర్శనమని హరీశ్ రావు అన్నారు. 

"టెండర్ ప్రక్రియ మొదలైన వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చి ఉంటే, ఐఐసీ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు టెండర్ ఖరారయ్యేది కాదు. ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేసి ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపింది. ఇది ముమ్మాటికీ రేవంత్ రెడ్డి తెలంగాణకు చేసిన ద్రోహమే" అని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Harish Rao
Revanth Reddy
Chandrababu Naidu
Nallamala Sagar Project
Telangana
Andhra Pradesh
Krishna River Water
Water Sharing Dispute
BRS Party
Telangana Politics

More Telugu News