భారత్‌-పాక్ మ‌ధ్య ఉద్రిక్తత.. చైనా ఏమందంటే..!

  • భార‌త్‌, పాకిస్థాన్ సంయ‌మ‌నం పాటించాలన్న డ్రాగ‌న్ కంట్రీ
  • ఇరుదేశాల మ‌ధ్య స‌మ‌స్య‌కు ముగింపున‌కు నిర్మాణాత్మ‌క పాత్ర పోషించ‌డానికి సిద్ధ‌మ‌ని వెల్ల‌డి
  • ఉద్రిక్త‌త‌ల‌ను తీవ్ర‌త‌రం చేసే చ‌ర్య‌ల‌ను రెండు దేశాలు త‌గ్గించుకోవాలని సూచ‌న‌
భారత్‌-పాకిస్థాన్ మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇరుదేశాల మ‌ధ్య రోజురోజుకూ ప‌రిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి. ఈ నేప‌థ్యంలో డ్రాగ‌న్ కంట్రీ చైనా స్పందించింది. ఇరుదేశాల మ‌ధ్య స‌మ‌స్య‌కు ముగింపు ప‌లికేందుకు అవ‌స‌ర‌మైతే నిర్మాణాత్మ‌క పాత్ర పోషించ‌డానికి తాము సిద్ధ‌మ‌ని తెలిపింది. భార‌త్‌, పాకిస్థాన్ సంయ‌మ‌నం పాటించాలని శ‌నివారం చైనా విదేశాంగ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  

"భార‌త్‌-పాక్ మ‌ధ్య నెలకొన్న ఉద్రిక్త‌త పరిస్థితుల‌ను నిశితంగా గ‌మ‌నిస్తున్నాం. స్థిర‌త్వం, శాంతి కోసం ఇరుదేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని కోరుతున్నాం. ఉద్రిక్త‌త‌ల‌ను తీవ్ర‌త‌రం చేసే చ‌ర్య‌ల‌ను రెండు దేశాలు త‌గ్గించుకోవాలి. శాంతియుతంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాలి. ఇరుదేశాల మ‌ధ్య స‌మ‌స్య‌ ముగింపున‌కు అవ‌స‌ర‌మైతే నిర్మాణాత్మ‌క పాత్ర పోషించ‌డానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని చైనా విదేశాంగ శాఖ త‌న‌ ప్ర‌క‌ట‌నలో పేర్కొంది. 

భార‌త్... ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్‌, పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌(పీఓకే)ల‌లోని ఉగ్ర‌స్థావరాలే ల‌క్ష్యంగా ఆప‌రేష‌న్ సిందూర్ చేప‌ట్టింది. తొమ్మిది ప్రాంతాల్లో క్షిప‌ణి దాడులు నిర్వ‌హించి సుమారు 100 మంది ముష్క‌రుల‌ను మట్టుబెట్టింది. కానీ, దాయాది పాకిస్థాన్ మాత్రం నీచ బుద్ధితో భార‌త్‌లోని పౌరులే ల‌క్ష్యంగా స‌రిహ‌ద్దు వెంబ‌డి డ్రోన్‌, మిస్సైల్ దాడుల‌కు తెగ‌బ‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త తీవ్ర‌త‌ర‌మైంది.  


More Telugu News