Kolusu Parthasarathy: గోబెల్స్ కాదు... ఇక 'జగన్ బెల్స్' అని పిలవాలేమో!: మంత్రి పార్థసారథి

Kolusu Parthasarathy Slams Jagan Reddy Propaganda as Jagan Bells
  • భక్తుల మనోభావాలపై జగన్మోహన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నారన్న మంత్రి పార్థసారథి
  • రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ విష ప్రచారం చేస్తోందని ఆరోపణ
  • తిరుమలలో మద్యం సీసాల కుట్రను సీసీ కెమెరాలు బట్టబయలు చేశాయని వెల్లడి
  • స్వామిని నల్లరాయి అన్న భూమన ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా
  • లడ్డూ నెయ్యిలో అవినీతిపై విచారణ జరుగుతోందని, త్వరలో నిజాలు బయటపడతాయని వెల్లడి
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భక్తుల మనోభావాలపై దండయాత్ర చేస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా అబద్ధాలతో విష ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం నాడు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజల సంతృప్తే లక్ష్యంగా పనిచేస్తుంటే, వైసీపీ మాత్రం విధ్వంసక ధోరణి వీడటం లేదన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో గతంలో 'గోబెల్స్' పేరు వినేవాళ్లమని, ఇప్పుడు జగన్ బృందం తీరు చూస్తుంటే దాన్ని 'జగన్ బెల్స్' ప్రచారం అని పిలవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలపడానికి, జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెంచడానికి నిరంతరం శ్రమిస్తున్నారని పార్థసారథి తెలిపారు. అయితే, అధికారం కోల్పోయిన వైసీపీ నేతలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి, ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. వారి తీరు చూస్తుంటే "వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు వెళ్లినట్లు"ఉందని, రాష్ట్ర ఆదాయానికి కీలకమైన ఆధ్యాత్మిక పర్యాటకాన్ని దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు.

తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు వైసీపీ పెద్ద కుట్ర పన్నిందని పార్థసారథి ఆరోపించారు. ఇటీవల తిరుమలలో మద్యం సీసాలు దొరికాయని చేసిన ప్రచారం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని అన్నారు. 

"తిరుపతిలో ఖాళీ మద్యం సీసాలను కొనుగోలు చేసి, వాటిని కొండపైకి తీసుకెళ్లి పెట్టి.. అపవిత్రం జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన వేల సీసీ కెమెరాల వల్ల ఈ కుట్ర బయటపడింది. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు పోలీసులకు చిక్కారు. వారు సాక్షి పత్రిక విలేకరులో లేదా భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులో అని తిరుపతిలో చర్చ జరుగుతోంది" అని ఆయన వివరించారు. 

గతంలో వెంకటేశ్వర స్వామిని 'నల్లరాయి' అని కించపరిచిన భూమన, ఇప్పుడు ఒంటినిండా నామాలు పెట్టుకుని హిందువునని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.

వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం కోసం వాడిన నెయ్యిలో కనీసం 20 శాతం స్వచ్ఛత కూడా లేదని, పామాయిల్, జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై విచారణ జరుగుతోందని మంత్రి వెల్లడించారు. కేవలం ముడుపుల కోసమే నాణ్యత లేని సంస్థల నుంచి నెయ్యి కొన్నారని ఆరోపించారు. దేవుడిపై నమ్మకం లేని భూమనకు ఛైర్మన్ పదవి ఇచ్చి, తిరుమల నిధులను భక్తుల సౌకర్యాలకు కాకుండా తిరుపతిలో రాజకీయ లబ్ధి కోసం ఖర్చు చేశారని దుయ్యబట్టారు. 

వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు అనుమానాస్పదంగా మరణించినట్లే, వైసీపీ హయాంలో జరిగిన పరకామణి దొంగతనం కేసులో సాక్షిగా ఉన్న అధికారి కూడా రైలు కింద పడి చనిపోవడం వెనుక ఉన్న మిస్టరీ ఏమిటని ప్రశ్నించారు. గోవిందరాజస్వామి ఆలయంలో బంగారు తాపడం కోసం వాడాల్సిన కిలోల కొద్దీ బంగారాన్ని సైతం దోచేశారని ఆరోపించారు. 

గత ఐదేళ్ల తమ దోపిడీని కప్పిపుచ్చుకోవడానికే వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడుతోందని, ప్రజలు వాస్తవాలను గమనించాలని కోరారు. "మీరు అభివృద్ధికి సహకరించకపోయినా ఫర్వాలేదు, కనీసం నోరు మూసుకుని ఉండి రాష్ట్రంపై విషం చిమ్మకండి" అని వైసీపీ నేతలకు ఆయన హితవు పలికారు.
Kolusu Parthasarathy
Jagan Mohan Reddy
YSRCP
TDP
Andhra Pradesh Politics
Tirumala
Bhuma Karunakar Reddy
Tirupati
Hindu sentiments
political criticism

More Telugu News