Revanth Reddy: వాహనాల చలాన్లకు డిస్కౌంట్ ఇవ్వొద్దు... ఖాతా నుంచి వెంటనే డబ్బులు కట్ కావాలి: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy on Traffic Challan Discounts Creating Problems
  • వాహనాలకు చలాన్లు విధిస్తున్నప్పటికీ డిస్కౌంట్ ఇస్తారనే ఆలోచన ఉందని వ్యాఖ్య
  • వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని సూచన
  • మైనర్లకు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రులపై కేసు పెట్టాలన్న ముఖ్యమంత్రి
వాహనాలకు చలాన్లు విధిస్తున్నప్పటికీ, డిస్కౌంట్ ఇచ్చి తగ్గిస్తారనే భావన ఒక పెద్ద సమస్యగా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై ట్రాఫిక్ చలాన్లకు ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వరాదని ఆయన సూచించారు. ఏ వాహనమైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో యూసఫ్‌గూడ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'అర్కైవ్ అలైవ్' కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంటే, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా, వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని స్పష్టం చేశారు. ఈ విషయంపై బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మైనర్లు ప్రమాదాలకు గురైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల విషయంలో రవాణా శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. చాలా సందర్భాల్లో మన ప్రమేయం లేకున్నా, ఎదుటివారి తప్పుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. హైడ్రా, ఈగల్, సైబర్ క్రైమ్ విభాగాలను బలోపేతం చేసినట్లే, ట్రాఫిక్ నియంత్రణలోనూ పోలీస్ వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
Revanth Reddy
Telangana
Traffic Challans
Road Accidents
Traffic Rules
Yusufguda Stadium
Drink and Drive

More Telugu News