Vikram Misri: ఇరాన్ పరిణామాలు.. భారతీయులకు కీలక సూచనలు చేసిన విదేశాంగ కార్యదర్శి

Vikram Misri Issues Advisory for Indians in Iran Amid Unrest
  • ఇరాన్ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నట్లు వెల్లడి
  • ఇరాన్‌లో ప్రవాస భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారన్న విక్రమ్ మిస్రీ
  • భారత పౌరులు బయటకు వెళ్లి అల్లర్లలో చిక్కుకోవద్దని సూచన
ఇరాన్ పరిణామాలపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. ఇరాన్‌లో ఉన్న భారతీయులకు ఆయన కీలక సూచనలు జారీ చేశారు. ఇరాన్ దేశంలో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని ఆయన తెలిపారు. అక్కడ ప్రవాస భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. స్థానికంగా ఆంక్షలు ఉన్నప్పటికీ, రాయబార కార్యాలయం ఇరాన్‌లోని విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.

అందరూ క్షేమంగానే ఉన్నారని విక్రమ్ మిస్రీ తెలిపారు. ఇప్పటివరకు మన వాళ్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని గుర్తించినట్లు చెప్పారు. ఇరాన్‌లోని భారత పౌరులు ఎవరూ బయటకు వెళ్లవద్దని, అల్లర్లలో చిక్కుకోవద్దని సలహా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు.

ఇదిలా ఉండగా, ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు 500 మందికి పైగా మృతి చెందారు. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు కూడా మొదలయ్యాయి. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం సోమవారం లక్షలాది మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్‌లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేలాదిమంది ప్రదర్శనకారులు గుమికూడారు. ఈ ప్రదర్శనలో దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ తదితరులు పాల్గొన్నారు. 

దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు జరిగాయి. దీనిని అమెరికా-ఇజ్రాయెల్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇరాన్ చేపట్టిన తిరుగుబాటు ప్రదర్శనలుగా పేర్కొంది.
Vikram Misri
Iran
Indian Embassy Iran
Iran protests
Indians in Iran
Iran unrest
Tehran
India Iran relations

More Telugu News