పొలిటికల్ ఎంట్రీపై న‌టుడు అజిత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

  • సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చి 33 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన నటుడు
  • తనకు రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేదని స్ప‌ష్టీక‌ర‌ణ‌ 
  • పాలిటిక్స్ అంటే త‌న‌కు ఆస‌క్తి లేద‌న్న హీరో
  • విజయ్ పొలిటికల్ ఎంట్రీని సాహసోపేతమైన నిర్ణ‌యంగా పేర్కొన్న అజిత్‌
కోలీవుడ్ న‌టుడు అజిత్ కుమార్‌ రాజ‌కీయాల్లోకి రావ‌డంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి 33 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రాజకీయాల్లోకి వస్తున్న సినీ న‌టీన‌టులంద‌రికీ ఆయ‌న‌ శుభాకాంక్షలు తెలిపారు. అయితే, వ్యక్తిగతంగా తనకు రాజకీయాల్లోకి వ‌చ్చే ఉద్దేశం లేదని అజిత్ స్ప‌ష్టం చేశారు. పాలిటిక్స్ అంటే త‌న‌కు ఆస‌క్తి లేద‌ని తెలియ‌జేశారు. 

ఇక, రాజకీయాల్లో మార్పు తీసుకురాగలమనే విశ్వాసంతో అడుగులు వేస్తున్న వారందరూ విజయం సాధించాలని ఈ సంద‌ర్భంగా ఆయన ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల కొత్త రాజ‌కీయ పార్టీ స్థాపించి, రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ తన మిత్రుడు, ద‌ళ‌ప‌తి విజయ్ పొలిటికల్ ఎంట్రీని సాహసోపేతమైన నిర్ణ‌యంగా అజిత్ పేర్కొన్నారు. 

కాగా, 140 కోట్ల జనాభా కలిగిన ఇండియాలో వివిధ మతాలు, జాతులు, భాషలు కలిగిన ప్రజలు సామరస్యంగా జీవించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అజిత్ కొనియాడారు. ఇంతటి వైవిధ్యాన్ని కలిగి ఉన్న దేశాన్ని ఏకతాటిపై నడిపించడం కేవ‌లం రాజకీయ నాయకులకే సాధ్యమవుతుందన్నారు.

ఇటీవ‌లే అజిత్‌కు కేంద్ర ప్ర‌భుత్వం పద్మభూషణ్ అవార్డుతో స‌త్క‌రించిన విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా తాను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను సంద‌ర్శించిన విషయాన్ని ఆయ‌న గుర్తు చేశారు. అక్కడి భద్రతా ఏర్పాట్లు త‌న‌ను ఆశ్చర్యానికి గురి చేశాయ‌ని ఆయ‌న‌ వెల్లడించారు. 

దేశ నాయకులు తమ జీవితాలను ఎలా గడుపుతున్నారో అప్పుడే తనకు అర్థమైందని అజిత్‌ చెప్పారు. ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని బాధ్యతగా నడిపించడం చాలా కష్టమైన పని అని తాను అప్పుడు గ్రహించానన్నారు. అందుకే నటుడు విజయ్ పాలిటిక్స్‌లోకి రావడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన చెప్పుకొచ్చారు. 


More Telugu News