Nagarjuna: జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు: నాగార్జున

Nagarjuna Expresses Happiness Over Family Life in 2025
  • వ్యక్తిగతంగానూ కెరీర్ పరంగానూ 2025 ఎంతో సంతృప్తినిచ్చిందని వెల్లడి
  • గత 45 ఏళ్లుగా ఒక్కరోజు కూడా జిమ్ మిస్ కాలేదని వివరణ
  • వేళకు భోజనం చేయడమే తన ఆరోగ్య రహస్యమన్న నాగ్ 
2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని టాలీవుడ్ మన్మథుడు, కింగ్ నాగార్జున  ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాదే తన చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ వివాహం జరగడం, పెద్ద కుమారుడు నాగ చైతన్య-శోభిత దంపతులు తమ వైవాహిక జీవితంలో ఏడాది పూర్తి చేసుకోవడం తనకు ఎంతో తృప్తినిచ్చాయని తెలిపారు. జీవితంలో ఇంతకంటే తాను కోరుకునేది ఏమీ లేదన్నారు.

ఇక ఆరు పదుల వయసు దాటినా తన గ్లామర్‌తో, ఫిట్‌నెస్‌తో నేటి యువ హీరోలకు నాగార్జున గట్టి పోటీ ఇస్తున్నారు. 66 ఏళ్ల వయసులోనూ ఆయన అంత ఫిట్‌గా ఉండటం వెనుక ఉన్న రహస్యాన్ని తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ప్రధానంగా తన క్రమశిక్షణే తన ఆరోగ్యానికి కారణమని నాగార్జున స్పష్టం చేశారు.

గత 45 ఏళ్లుగా తాను క్రమం తప్పకుండా జిమ్ చేస్తున్నానని, ఆరోగ్యం బాగోలేనప్పుడు తప్ప మిగతా ఏ రోజు కూడా వ్యాయామానికి డుమ్మా కొట్టలేదని నాగార్జున తెలిపారు. ఫిట్‌నెస్ కోసం తాను ఎప్పుడూ కడుపు మాడ్చుకుని డైటింగ్ చేయనని, సమయానికి పౌష్టికాహారం తీసుకుంటానని వివరించారు. శారీరక శ్రమతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమని, ఏ విషయాన్నైనా తాను పాజిటివ్‌గా తీసుకుంటానని, సమస్యలు వచ్చినప్పుడు నిరుత్సాహపడనని చెప్పుకొచ్చారు.

కెరీర్ పరంగా చూస్తే.. 2025లో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' సినిమాలో సైమన్ పాత్రలో, శేఖర్ కమ్ముల 'కుబేర'లో మాజీ సీబీఐ అధికారి దీపక్‌తేజ్‌గా నాగార్జున మెప్పించారు. ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా పనుల్లో నాగార్జున బిజీగా ఉన్నారు. క్రమశిక్షణ, సానుకూల దృక్పథంతో నాగార్జున మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.


Nagarjuna
Akkineni Nagarjuna
Akkineni Akhil
Naga Chaitanya
Shobhita Dhulipala
Tollywood
fitness
Kubera movie
Coolie movie
Lokesh Kanagaraj

More Telugu News