Telangana: ట్రాన్స్‌జెండర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Telangana Transgenders Get 100 Percent Subsidized Loans
  • స్వయం ఉపాధి కోసం రూ.75 వేల వరకు ఆర్థిక సాయం
  • నూటికి నూరు శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు
  • జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన
తెలంగాణలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సమాజంలో ట్రాన్స్‌జెండర్లు (హిజ్రాలు) కూడా గౌరవప్రదమైన జీవనం సాగించేలా, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడేలా భరోసా కల్పిస్తోంది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను ట్రాన్స్‌జెండర్లకు 100 శాతం సబ్సిడీతో రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది.

ఈ పథకం ద్వారా అర్హులైన వారికి రూ.75 వేల వరకు రుణం మంజూరు చేయనున్నారు. ఇది పూర్తిగా సబ్సిడీతో కూడుకున్నది కావడంతో లబ్ధిదారులు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా రంగంలో నైపుణ్య శిక్షణ పొంది, సొంతంగా చిరు వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సాయం అందిస్తారు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు ఉన్న ట్రాన్స్‌జెండర్లు ఈ పథకానికి అర్హులని దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌జెండర్స్ సాధికారిత శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఈ పథకం కింద 30 స్వయం ఉపాధి యూనిట్లను ప్రభుత్వం కేటాయించింది. ఆసక్తి గల అభ్యర్థులు నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్‌లో ఉన్న కార్యాలయంలో అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలి. లేదా www.wdsc.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వచ్చే నెల (జనవరి) 31వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అందిన దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీ పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. మరిన్ని వివరాల కోసం 9640452773 నంబర్‌ను సంప్రదించవచ్చు.
Telangana
Transgenders
Transgender Loan Scheme
Telangana Government
Revanth Reddy
Transgender Empowerment
Telangana News
Hyderabad
Self Employment
Subsidized Loans

More Telugu News