Hardik Pandya: న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు పాండ్యాకు విశ్రాంతి..!

Hardik Pandya Rested for New Zealand ODI Series
  • విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడనున్న హార్దిక్
  • జనవరి 11 నుంచి జరిగే కివీస్ వన్డే సిరీస్‌కు దూరం
  • టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం
  • బుమ్రా, హార్దిక్ ఇద్దరూ కివీస్ తో టీ20 సిరీస్‌ ఆడే ఛాన్స్
  • త్వరలో భారత జట్టు ఎంపికపై సెలక్టర్ల సమావేశం
టీ20 ప్రపంచకప్‌నకు సన్నద్ధమవుతున్న టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ లు ఆడబోతున్న హార్దిక్, జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు మాత్రం దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

ఐఏఎన్ఎస్ కథనం ప్రకారం... హార్దిక్ పాండ్యా జనవరిలో బరోడా తరఫున రెండు విజయ్ హజారే లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. జనవరి 3న విదర్భతో, జనవరి 8న చండీగఢ్‌తో జరిగే మ్యాచ్‌లలో బరిలోకి దిగుతాడు. అయితే పని ఒత్తిడిని తగ్గించుకునే క్రమంలో జనవరి 6న జమ్మూ కాశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉంటాడు. వాస్తవానికి హార్దిక్ కివీస్ సిరీస్ ఆడాలని భావించినప్పటికీ, ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే టీ20 వరల్డ్ కప్ కోసం అతడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని మేనేజ్‌మెంట్ సూచించినట్లు తెలుస్తోంది.

మరోవైపు పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా తగిన విశ్రాంతినిస్తున్నారు. వీరిద్దరూ జనవరి 21న నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్ తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో ఆడే అవకాశం ఉంది. ఇక, వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు వీరిద్దరూ అత్యంత కీలకం కానున్నారు.

ఇదిలాఉండగా, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జనవరి మొదటి వారంలో సమావేశమై న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు జట్టును ఎంపిక చేయనుంది. మెడ గాయం నుంచి కోలుకున్న శుభ్‌మన్ గిల్ తిరిగి వన్డే జట్టు పగ్గాలు చేపట్టే అవకాశాలున్నాయి. అలాగే శ్రేయస్ అయ్యర్ ఫిట్‌నెస్, వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్, ఇషాన్ కిషన్, ధ్రువ్ జురెల్ మధ్య ఉన్న పోటీపై కూడా సెలక్టర్లు దృష్టి సారించనున్నారు.
Hardik Pandya
India Cricket
New Zealand series
Vijay Hazare Trophy
T20 World Cup
Jasprit Bumrah
Shubman Gill
Shreyas Iyer
Ajit Agarkar

More Telugu News