పంజాబ్-కోల్‌కతా మ్యాచ్‌లో వరుణుడిదే గెలుపు.. ఇరు జట్లకు చెరో పాయింట్

  • ఈ సీజన్‌లో తొలిసారి వర్షం కారణంగా ఆగిన మ్యాచ్
  • తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోరు సాధించిన పంజాబ్ కింగ్స్
  • కోల్‌కతా ఇన్నింగ్స్ ప్రారంభమైన వెంటనే ప్రారంభమైన వాన
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పంజాబ్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ సీజన్‌లో వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు కావడం ఇదే తొలిసారి. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగి ఒక ఓవర్ ఆడిన తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. అప్పటికి కోల్‌కతా ఒక ఓవర్‌లో వికెట్ నష్టపోకుండా ఏడు పరుగులు చేసింది. ఆ సమయంలో భారీ గాలులతో వర్షం ప్రారంభమైంది. గాలుల కారణంగా మైదానంలో కవర్లను ఏర్పాటు చేయడం కూడా కష్టంగా మారింది. ఆ తర్వాత కూడా వర్షం ఎడతెరిపి లేకుండా పడటంతో మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ బ్యాట్‌తో కదం తొక్కడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రియాంశ్ ఆర్య 35 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, ప్రభ్‌సిమ్రన్ 49 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 83 పరుగులు చేశారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 25 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు 11 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, 7 పాయింట్లతో కోల్‌కతా ఏడో స్థానంలో ఉంది.


More Telugu News