Golden Globes 2026: గోల్డెన్ గ్లోబ్స్ 2026: 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' హవా.. పాడ్‌కాస్ట్ విభాగంలో అమీ పోహ్లర్ రికార్డు

Golden Globes 2026 One Battle After Another wins big Amy Poehler sets record
  • బెస్ట్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే విభాగాల్లో పాల్ థామస్ అండర్సన్ జయకేతనం
  • 'మార్టీ సుప్రీం' చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్‌గా నిలిచిన తిమోతీ చాలమెట్
  • ప్రజెంటర్‌గా మెరిసిన ప్రియాంక చోప్రా.. వేదికపై లిసా (బ్లాక్‌పింక్)తో సందడి
హాలీవుడ్ అవార్డుల సీజన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్టన్ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ ఏడాది అవార్డుల్లో పాల్ థామస్ అండర్సన్ దర్శకత్వం వహించిన 'వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్' చిత్రం ప్రధాన విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికి గాను అండర్సన్ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులను కైవసం చేసుకున్నారు. మరోవైపు, 'మార్టీ సుప్రీం' చిత్రంలో నటనకు గాను తిమోతీ చాలమెట్ ఉత్తమ నటుడిగా (మ్యూజికల్/కామెడీ) నిలిచారు.

గోల్డెన్ గ్లోబ్స్ చరిత్రలో ఈసారి సరికొత్తగా 'పాడ్‌కాస్ట్' విభాగాన్ని ప్రవేశపెట్టారు. 'గుడ్ హ్యాంగ్ విత్ అమీ పోహ్లర్'కు గాను నటి అమీ పోహ్లర్ తొలి బెస్ట్ పాడ్‌కాస్ట్ గ్లోబ్ అవార్డును అందుకుని రికార్డు సృష్టించారు. అలాగే, 'అడాల్సెన్స్' చిత్రంలో నటనకు గాను 16 ఏళ్ల ఐరిష్ నటుడు ఓవెన్ కూపర్ ఉత్తమ సహాయ నటుడిగా నిలిచి, ఈ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కాడు.

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె కే-పాప్ బ్యాండ్ 'బ్లాక్‌పింక్' సభ్యురాలు లిసాతో కలిసి 'బెస్ట్ మెయిల్ యాక్టర్ - టెలివిజన్' అవార్డును నోవా వైల్ (ది పిట్) కు అందజేశారు. ఇక ఉత్తమ యానిమేటెడ్ చిత్రంగా 'కేపాప్ డెమాన్ హంటర్' నిలవగా, ఆ చిత్రంలోని 'గోల్డెన్' పాటకు గాను కొరియన్ సింగర్ ఇజాయె ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును అందుకుని భావోద్వేగానికి లోనయ్యారు. హోస్ట్ నిక్కీ గ్లేజర్ తనదైన శైలిలో పంచ్‌లతో వేడుకను ఉత్సాహంగా నడిపించారు. 
Golden Globes 2026
One Battle After Another
Paul Thomas Anderson
Timothee Chalamet
Amy Poehler
Owen Cooper
Priyanka Chopra
Lisa Blackpink
Kpop Demon Hunter

More Telugu News