గిల్ గొప్ప మ‌న‌సు.. రూ. 35ల‌క్ష‌లు విలువ చేసే వైద్య ప‌రిక‌రాలు విరాళం

  • సీఎస్ఆర్ ప్రోగ్రామ్‌లో భాగంగా యంగ్ ప్లేయ‌ర్ ఔదార్యం
  • మొహాలీ ఫేజ్-4 సివిల్ ఆసుప‌త్రికి వైద్య ప‌రిక‌రాల విత‌ర‌ణ‌
  • తాను క్రికెట్ ఒన‌మాలు నేర్చుకున్న న‌గ‌రం ప‌ట్ల‌ గిల్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌
టీమిండియా యువ‌ క్రికెట‌ర్‌, ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజ‌రాత్ టైటాన్స్ (జీటీ) కెప్టెన్ శుభ‌మ‌న్ గిల్ గొప్ప మ‌న‌సు చాటుకున్నాడు. మొహాలీలోని ఫేజ్-4 సివిల్ ఆసుప‌త్రికి సుమారు రూ. 35లక్ష‌లు విలువ చేసే వైద్య ప‌రిక‌రాల‌ను విరాళంగా ఇచ్చాడు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ప్రోగ్రామ్‌లో భాగంగా యంగ్ ప్లేయ‌ర్ ఇలా ఔదార్యాన్ని చాటాడు. ఆ ప్రాంతంలో వైద్య సేవలను మ‌రింత‌ మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ కార్య‌క్ర‌మం కొన‌సాగుతోంది. కాగా, శుభ‌మ‌న్ సీక్రెట్‌గా ఈ డొనేష‌న్ చేశాడు. 

ఇక గిల్‌ విరాళంగా ఇచ్చిన వైద్య ప‌రిక‌రాల‌లో వెంటిలేట‌ర్లు, ఐసీయూ బెడ్లు, ఆప‌రేష‌న్ థియేట‌ర్ టేబుళ్లు, సీలింగ్ లైట్లు, సిరంజి పంపులు, ఎక్స్ రే మెషీన్లు ఉన్న‌ట్లు మొహాలీ సివిల్ సర్జన్ డాక్ట‌ర్ సంగీత జైన్ తెలిపారు. ఆసుప‌త్రికి విరాళం అంద‌జేసిన గిల్‌కు ఆమె ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆసుపత్రి అవసరాల ఆధారంగా పరికరాలు కేటాయిస్తామని వైద్యురాలు చెప్పారు. అవసరమైతే ఇతర ఆసుపత్రులకు కూడా వాటి వ‌ల్ల‌ ప్రయోజనం చేకూరుతుందని ఆమె పేర్కొన్నారు. 

మొహాలీ ప‌ట్ట‌ణంతో గిల్‌కు ప్ర‌త్యేక‌ అనుబంధం ఉంది. ఆ సిటీలోనే అత‌ను చిన్న‌త‌నంలో క్రికెట్ శిక్ష‌ణ పొందాడు. ప్ర‌స్తుతం అక్క‌డే ఇల్లు కూడా క‌ట్టుకుంటున్నాడు. 

తాజాగా జ‌రిగిన ఈ విరాళాల కార్యక్రమానికి గిల్‌ అత్త, పాటియాలా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కుశాల్దీప్ కౌర్ హాజరయ్యారు. 

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో శుభ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు అద్భుతంగా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 6 మ్యాచ్‌లు ఆడి 4 విజ‌యాలు న‌మోదు చేసింది. త‌ద్వారా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌లో ఉంది. త‌న త‌ర్వాతి మ్యాచ్‌ను ఈ నెల 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో ఆడ‌నుంది. 


More Telugu News