హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం... సీఎం ఆదేశాల‌తో విచార‌ణ షురూ

  • ఉచిత పాస్‌ల కోసం హెచ్‌సీఏ తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంద‌న్న‌ స‌న్‌రైజ‌ర్స్‌
  • అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావు ప‌లుమార్లు బెదిరించారంటూ ఆరోప‌ణ‌
  • ఎస్ఆర్‌హెచ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో సీఎం రేవంత్ విచార‌ణ‌కు ఆదేశం
  • ఇవాళ‌ ఉప్ప‌ల్ స్టేడియంలో విచార‌ణ‌కు వెళ్లిన విజిలెన్స్ అధికారులు
ఉచిత పాస్‌ల కోసం హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) త‌మ‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంద‌ని, అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావు ప‌లుమార్లు బెదిరించార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్) ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఇలాగైతే తాము హైద‌రాబాద్ వ‌దిలి వెళ్లిపోతామ‌ని స‌న్‌రైజ‌ర్స్‌ హెచ్చ‌రించింది కూడా. 

స‌న్‌రైజ‌ర్స్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విచార‌ణ‌కు ఆదేశించారు. స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని విజిలెన్స్ అధికారుల‌ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేర‌కు విజిలెన్స్ అధికారులు ఈ వివాదంలో నిజ‌నిజాలు రాబ‌ట్టేందుకు ఈరోజు ఉప్ప‌ల్ స్టేడియానికి వెళ్లారు. విజిలెన్స్ చీఫ్ కొత్త‌కోట శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో విచార‌ణ కొన‌సాగుతోంది. 

హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న‌రావు, మైదానం సిబ్బందిని అధికారులు విచారిస్తున్నారు. టికెట్ల విక్ర‌యం, పాస్‌ల జారీ త‌దిత‌ర విష‌యాల‌ను అధికారులు వారిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, గ‌తంలోనూ హెచ్‌సీఏలో అక్ర‌మాలు జ‌రుగుతున్నాయంటూ భువ‌న‌గిరి ఎంపీ చామ‌ల కిర‌ణ్‌కుమార్ రెడ్డి ఫిర్యాదు మేర‌కు ఉప్ప‌ల్ స్టేడియంలో త‌నిఖీలు జ‌రిగిన విష‌యం తెలిసిందే.       


More Telugu News