టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతి

  • తిరుపతిలో గుండెపోటుతో మరణించిన గరిమెళ్ల
  • గరిమెళ్ల వయసు 76 సంవత్సరాలు
  • ప్రగాఢ సానుభూతి తెలిపిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
సంగీత దిగ్గజం, ప్రముఖ గాయకుడు, టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. తిరుపతిలోని తన స్వగృహంలో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. 

గరిమెళ్ల మృతిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. గరిమెళ్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నానని వెల్లడించారు. సంప్రదాయ సంగీత ప్రపంచానికి గరిమెళ్ల మృతి తీరని లోటు అని పేర్కొన్నారు. 

తిరుమల తిరుపతి దేవస్థాన విద్యాంసుడిగా గరిమెళ్ల విశేష సేవలందించారని బీఆర్ నాయుడు కొనియాడారు. వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేసిన ఘనత గరిమెళ్ల సొంతం అని కీర్తించారు. 

వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిత తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ అన్నమాచార్య కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారని వివరించారు. సంప్రదాయ, కర్నాటక, లలిత, జానపద సంగీతంలోనూ ఆయన ప్రసిద్ధులు అని బీఆర్ నాయుడు వివరించారు.


More Telugu News