'అర్నబ్' తుపానుతో పోలిస్తే 'మురసు' తీవ్రత తక్కువే.. అయినా అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

Andhra
Advertisement
  • బంగాళాఖాతంలో మురసు తుపాను
  • ఈ రాత్రికి తీరం తాకుతుందని నివేదికలు
  • పలు కోస్తా జిల్లాల్లో నేటిరాత్రి నుంచి భారీ వర్షాల హెచ్చరిక మరోసారి ఆర్టీజీఎస్ లో చంద్రబాబు సమీక్ష
  • 45 వేల మంది సిబ్బందిని అప్రమత్తం చేసిన సీఎం
  • బుడమేరు, ప్రకాశం బ్యారేజీకి భారీ వరద ప్రవాహం అంచనా
  • ప్రాణ నష్టం నివారించడమే లక్ష్యమని అధికారులకు ఆదేశం
Advertisement
‘అర్నబ్’ తుపానుతో పోలిస్తే ‘మురసు’ తీవ్రత తక్కువే అయినా, అధికార యంత్రాంగం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చూడటమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించడంపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. 'మురసు' తుపాను సన్నద్ధతపై అమరావతిలోని రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం (ఆర్టీజీ) నుంచి ఆయన సోమవారం మరోసారి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ టెలికాన్ఫరెన్సులో రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన దాదాపు 45 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

'మురసు' తుపాను ప్రభావంతో సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని సీఎం తెలిపారు. ముఖ్యంగా పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ఈ రోజు రాత్రి 12 గంటల నుంచి రేపు రాత్రి 12 గంటల వరకు కోస్తాంధ్రపై తుపాను ప్రభావం ఉంటుందని, రాష్ట్రంలోని 848 స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పరిధిలో దీని ప్రభావం కనిపించవచ్చని అంచనా వేశారు. ప్రతి గంటకూ రియల్ టైమ్ లో తుపాను హెచ్చరికలను ప్రజలకు జారీ చేయాలని సూచించారు.

తుపాను కారణంగా నాగార్జునసాగర్, పులిచింతల, బుడమేరు క్యాచ్‌మెంట్ ఏరియాలకు వరద ప్రవాహాలు వస్తాయని హెచ్చరించారు. ముఖ్యంగా బుడమేరుకు మంగళవారం నాటికి 30 వేల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని జలవనరుల శాఖను ఆదేశించారు. అదేవిధంగా, నవంబర్ 4వ తేదీ నాటికి కృష్ణా నదిపై ఉన్న ప్రకాశం బ్యారేజీకి 2.75 లక్షల క్యూసెక్కుల మేర వరద రావొచ్చని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని అంచనా వేశారు. గుండ్లకమ్మకు కూడా వరద ప్రవాహం ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.

భారీ గాలులకు విద్యుత్ స్తంభాలు నేలకూలే అవకాశం ఉన్నందున, పునరుద్ధరణ పనుల కోసం 5 వేల మంది సిబ్బందిని సిద్ధం చేశామని సీఎం తెలిపారు. గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు అంతరాయం కలగవచ్చని, సరఫరాలో సమస్య తలెత్తిన వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 14,760 చిన్న నీటిపారుదల చెరువులకు గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆక్వా, హార్టీకల్చర్ రంగాలపై ప్రభావం ఉంటుందని అప్రమత్తం చేశారు.

గతంలో అర్నబ్ తుపాను సమయంలో ముందస్తు జాగ్రత్తలతో నష్టాన్ని చాలావరకు తగ్గించగలిగామని గుర్తుచేశారు. ఈసారి కూడా ప్రాణ నష్టం జరగకుండా, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గిస్తే ప్రజల్లో ప్రభుత్వ పట్ల భరోసా పెరుగుతుందని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, తుపాను షెల్టర్లకు తరలించాలని, క్షేత్రస్థాయి సిబ్బంది చిన్నపాటి నిర్లక్ష్యం కూడా చూపరాదని, తుపాను తీరం దాటేంత వరకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని గట్టిగా ఆదేశించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chandrababu NaiduCyclone MurasuAndhra PradeshWeather AlertFlood ManagementRTG Center

More Telugu News

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05

అమిత్ షాతో భేటీపై సోషల్ మీడియాలో స్పందించిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 21:52

ఆరేళ్లలో అతిపెద్ద జంప్.. మళ్లీ భారత నెం.1 కుబేరుడిగా ముకేశ్ అంబానీ

02 Nov, 21:39

మనకు ఇష్టమైన గోరింక పిట్ట ఆస్ట్రేలియన్లకు ఎందుకు నచ్చదు?

02 Nov, 21:19

హైదరాబాద్‌లో అమిత్ షాను కలిసిన చిరంజీవి, రామ్ చరణ్

02 Nov, 20:59

తుపాను ప్రభావిత ఏపీకి కర్ణాటక సాయం.. రంగంలోకి 500 మంది సిబ్బంది

02 Nov, 20:35

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

ఏపీ పుర పోరు: ముగిసిన రీపోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

02 Nov, 20:08

'ఓ మైసా రే'.. రష్మిక 'మైసా' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల

02 Nov, 19:52

కుల్దీప్ ను సిరీస్ మొత్తం పక్కనబెట్టడం ఆశ్చర్యంగా ఉంది: వెంకటపతిరాజు

02 Nov, 19:37

దేశంలో పెరుగుతున్న హెలికాప్టర్ ప్రమాదాలు.. ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలంటున్న పైలట్ల సమాఖ్య

02 Nov, 19:24

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌: భారత-ఏ కెప్టెన్‌గా తిలక్ వర్మ.. జట్టులో హేమాహేమీలకు చోటు!

02 Nov, 19:01

ఏపీ తీరం వైపు 'మురసు'.. పోర్టుల్లో పెను ప్రమాద హెచ్చరికలు.. దక్షిణ కోస్తాలో రెడ్ అలర్ట్

02 Nov, 18:24
..More Telugu News