Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒకే 'ఫెయిల్డ్ ప్రొడక్ట్'ను పదేపదే లాంచ్ చేస్తున్నారు: కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

Narendra Modi slams Congress for launching failed product repeatedly
Advertisement
  • విదేశాలకు వెళ్లి దేశ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారు
  • కాంగ్రెస్‌పై ఇప్పుడు ఐడియలాజికల్ నక్సల్స్ ప్రభావం ఉందన్న మోదీ
  • భారత ప్రజలు 'మేము చేసి చూపిస్తాం' అనే స్ఫూర్తితో ఉన్నారు
  • వికసిత భారత్ లక్ష్యమని పునరుద్ఘాటించిన ప్రధాని
Advertisement
కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ నాయకుడి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ విదేశీ గడ్డపై దేశ ప్రతిష్ఠను దిగజార్చుతోందని, అంతర్జాతీయ శక్తుల జోక్యాన్ని కోరుకుంటోందని ఆరోపించారు. గురువారం ఎన్డీటీవీ నిర్వహించిన ‘వరల్డ్ సదస్సు’లో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తన ‘ఫెయిల్డ్ ప్రొడక్ట్’ను పదేపదే లాంచ్ చేసేందుకు ప్రయత్నిస్తోందని మోదీ ఎద్దేవా చేశారు. పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. "దేశవ్యాప్తంగా జరిగే లాంచింగ్‌ల కంటే ఎక్కువగా ఒకే నాయకుడిని లాంచ్ చేయడానికి కాంగ్రెస్ శ్రమిస్తోంది. ద్రాక్ష పళ్లు పుల్లన అంటే ఇదేనేమో" అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్‌లోని ఒకే కుటుంబం ఆ పార్టీకి భారంగా మారిందని, ఈ విషయం సీనియర్ నేతలకు తెలిసినప్పటికీ వారు మౌనం వహిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ‘ఐడియలాజికల్ నక్సల్స్’ (భావజాల నక్సల్స్) గుప్పిట్లోకి వెళ్లిపోయిందని, ఒకప్పుడు అడవుల్లో విధ్వంసం సృష్టించిన వారు ఇప్పుడు దేశ వినాశనానికి ప్రణాళికలు రచిస్తున్నారని మోదీ సంచలన ఆరోపణలు చేశారు. దీనివల్ల కాంగ్రెస్ తన స్వతంత్ర ఆలోచనా శక్తిని కోల్పోయిందని విమర్శించారు. ప్రతిపక్షంలో ప్రతిభావంతులైన యువ ఎంపీలు ఉన్నప్పటికీ, కేవలం ఒక్క వ్యక్తికే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత ప్రజలు మాత్రం ‘మేము ఏదైనా సాధించగలం’ అనే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారని, 140 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసమే దేశానికి అతిపెద్ద బలమని మోదీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
Advertisement
Advertisement
Narendra Modi
Congress Party
Rahul Gandhi
NDTV World Summit
Ideological Naxals
Viksit Bharat

More Telugu News