Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి

Gunda Lakshmi Devi joins YSRCP in a major shock to TDP
Advertisement
  • జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న మాజీ ఎమ్మెల్యే
  • 40 ఏళ్ల సేవకు తెలుగుదేశం పార్టీలో అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన
  • భర్త విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నారని టీడీపీపై తీవ్ర ఆరోపణలు
  • ప్రజలకు మంచి చేయాలనే వైసీపీలో చేరానని వెల్లడి
Advertisement
టీడీపీకి శ్రీకాకుళం జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి వైసీపీలో చేరారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. లక్ష్మీదేవితో పాటు ఆమె అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా తమ కుటుంబం టీడీపీకి సేవలందించిందని, కానీ చివరకు తీవ్ర అవమానాలే ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసినా అన్నీ కోల్పోయామని వాపోయారు. 

తన భర్త, దివంగత నేత, మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నారంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు కనీసం పరామర్శించేందుకు కూడా టీడీపీ అధినేత రాలేదని ఆమె విమర్శించారు.

తన భర్త విగ్రహాన్ని శ్రీకాకుళంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే, స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నారని, విగ్రహం కోసం నిర్మించిన దిమ్మెలను కూడా ధ్వంసం చేశారని గుండ లక్ష్మీదేవి తీవ్ర ఆరోపణలు చేశారు. 

ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే ఎంతో బాధతో పార్టీని వీడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో టికెట్ నిరాకరించినా పార్టీలోనే కొనసాగామని, అయినా తమను దూరం పెట్టారని అన్నారు.

ఇటీవల శ్రీకాకుళం మేయర్ పదవిని ఆమె ఆశించగా, పొత్తులో భాగంగా ఆ పదవిని జనసేనకు కేటాయించడంతో పరిణామాలు వేగంగా మారాయి. ఈ నేపథ్యంలోనే మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఇతర వైసీపీ నేతలు ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. 

కూటమి పాలనలో ప్రజలు కష్టాలు పడుతున్నారని, వారికి మంచి చేయాలనే లక్ష్యంతోనే వైసీపీలో చేరానని లక్ష్మీదేవి తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా నిబద్ధతతో పనిచేశానని, వైసీపీలో కూడా జగన్ నాయకత్వంలో అదే నిబద్ధతతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు. 
Advertisement
Advertisement
Gunda Lakshmi Devi
YSRCP
TDP
Srikakulam
YS Jagan Mohan Reddy
Andhra Pradesh Politics

More Telugu News