Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డ్రైవింగ్‌ లైసెన్స్‌ సేవలకు ఫీజు మినహాయింపు? కేంద్రం కొత్త ప్లాన్‌ ఇదే!

Central Government plans fee exemption for driving license services
Advertisement
  • డ్రైవింగ్‌ ట్యుటోరియల్‌ ఉత్తీర్ణత మార్కులు 75 శాతానికి పెంపు ప్రతిపాదన
  • ట్యుటోరియల్‌ కనీస వ్యవధి 30 నిమిషాలు
  • ఆధార్‌ ఆధారిత నిర్దిష్ట ఆన్‌లైన్‌ సేవలకు ఫీజు మినహాయింపు ప్రతిపాదన
  • లైసెన్స్‌ వివరాల మార్పు దరఖాస్తులపై 15 రోజుల్లో నిర్ణయం
  • చిరునామా మార్పుపై 30 రోజుల్లో నిర్ణయం లేకుంటే ఆమోదమైనట్లే
  • తుది నోటిఫికేషన్‌ తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి
Advertisement
డ్రైవింగ్‌ లైసెన్స్‌ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూనే కొన్ని సేవలను సులభతరం చేసే దిశగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కీలక ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సురక్షిత డ్రైవింగ్‌ ట్యుటోరియల్‌ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులను పెంచడం, ఆధార్‌ ధ్రువీకరణతో ఆన్‌లైన్‌లో పొందే నిర్దిష్ట సేవలకు ఫీజు మినహాయింపు ఇవ్వడం ఇందులో ఉన్నాయి. లైసెన్స్‌పై పేరు, చిరునామా వంటి వివరాల మార్పునకు కూడా ఫీజు వసూలు చేయకూడదని ప్రతిపాదించింది. ఈ మార్పులపై కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

డ్రైవింగ్‌ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు పెంపు
ప్రస్తుతం సురక్షిత డ్రైవింగ్‌ ట్యుటోరియల్‌ అంచనాలో 60 శాతంగా ఉన్న ఉత్తీర్ణత మార్కులను 75 శాతానికి పెంచాలని ప్రతిపాదించింది. ఈ ట్యుటోరియల్‌ కనీసం 30 నిమిషాల పాటు ఉండాలి. డ్రైవింగ్‌ భద్రతపై అవగాహన పెంచడం, అంచనా విధానాన్ని మరింత కఠినతరం చేయడం ఈ ప్రతిపాదనల లక్ష్యం.

లైసెన్స్‌ వివరాల మార్పునకు గడువు
డ్రైవింగ్‌ లైసెన్స్‌పై పేరు, చిరునామా వంటి వివరాలను మార్చుకునేందుకు ఆన్‌లైన్‌ దరఖాస్తు విధానాన్ని క్రమబద్ధీకరించాలని ముసాయిదాలో పేర్కొన్నారు. దరఖాస్తులను 15 రోజుల్లో ఆమోదించాలి లేదా తిరస్కరించాలి. తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియజేయాలి. చిరునామా మార్పు దరఖాస్తుపై 30 రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే అది ఆమోదం పొందినట్లుగా పరిగణించాలని ప్రతిపాదించారు.

ఆధార్‌ సహా పలు ధ్రువీకరణ పత్రాలు
గుర్తింపు, వయసు, నివాస ధ్రువీకరణకు ఆధార్‌, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, గుర్తింపు పొందిన విద్యాసంస్థల సర్టిఫికెట్లు, జనన ధ్రువీకరణ పత్రాలను ఉపయోగించుకోవచ్చు. మూడు నెలలకు మించని విద్యుత్‌ బిల్లు, గ్యాస్‌ బిల్లును చిరునామా ధ్రువీకరణగా సమర్పించే అవకాశం కూడా ప్రతిపాదించారు. అయితే ఎల్‌ఐసీ పాలసీని ధ్రువీకరణ పత్రంగా అంగీకరించబోరని ముసాయిదాలో పేర్కొన్నారు.

లైసెన్స్‌ రెన్యువల్‌, డూప్లికేట్‌ లైసెన్స్‌, కొత్త వాహన తరగతి జోడింపు, వ్యక్తిగత వివరాల మార్పు వంటి సేవలకు ఒకే దరఖాస్తు ఫారాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. అందుబాటులో ఉన్న దరఖాస్తుదారుల వివరాలను సారథి పోర్టల్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ విధానంలో సేకరిస్తారు.

లైసెన్స్‌లోని వాహన తరగతిని తొలగించాలని దరఖాస్తు చేస్తే ఏడు రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. అలా శాశ్వతంగా తొలగించిన వాహన తరగతికి సంబంధించి ఏడాది పాటు లెర్నర్‌ లైసెన్స్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందేందుకు అర్హత ఉండదు.

ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేయడానికి సంబంధిత వర్గాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. తుది నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాతే కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
Advertisement
Advertisement
Central Government
Driving License
Road Transport Ministry
Driving License Fee Exemption
New Driving License Rules
Aadhaar Authentication

More Telugu News