Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మక్కా మసీదులో 'అనైతిక చర్య'.. ఇద్దరు బంగ్లాదేశీలకు సౌదీలో మరణశిక్ష

Saudi Arabia executes two Bangladeshis for immoral acts in Mecca mosque
Advertisement
  • తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే శిక్ష అమలు చేశారని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపణ
  • ఈ వార్త విని నిందితుల్లో ఒకరి బంధువు గుండెపోటుతో మృతి
  • అసలు నేరం ఏంటి?, విచారణ ఎలా జరిగిందనే దానిపై స్పష్టత కరవు
  • ఈ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని సౌదీని కోరిన బంగ్లాదేశ్
Advertisement
మక్కాలోని ఓ పవిత్ర మసీదులో 'అనైతిక చర్య'కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇద్దరు బంగ్లాదేశ్ వలస కార్మికులకు సౌదీ అరేబియా ప్రభుత్వం మరణశిక్ష అమలు చేసింది. అక్టోబర్ 14న ఈ శిక్షను అమలు చేయగా, ఈ విషయంపై తమకు సౌదీ అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.

సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సిటీ అక్తర్ (స్వీటీ అక్తర్) అనే ఇద్దరు బంగ్లాదేశీయులు మక్కాలోని మసీదులో 'ఫాహిషా' (లైంగిక అనైతిక చర్య)కు పాల్పడినట్లు తేలింది. నేరం తీవ్రత, పవిత్ర స్థలం, సమయం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఇస్లామిక్ చట్టంలోని తా'జీర్ (విచక్షణతో విధించే శిక్ష) కింద వారికి మరణశిక్ష విధించినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ పేర్కొంది. అయితే, వారు చేసిన నిర్దిష్ట నేరం ఏమిటి? ఎప్పుడు జరిగింది? విచారణ ఎలా సాగింది? వంటి వివరాలను మాత్రం సౌదీ అధికారులు వెల్లడించలేదు.

జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ నివేదిక ప్రకారం వీరిద్దరినీ 2023 ఆగస్టు ప్రారంభంలో అరెస్టు చేశారు. సైబర్‌క్రైమ్ చట్టం కింద నజ్రుల్‌ను, వ్యభిచారం ఆరోపణలపై స్వీటీని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరూ 'అల్ మజల్' అనే కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30న సౌదీ అధికారులు పంపిన ఖైదీల జాబితాలో వీరి పేర్లు ఉన్నప్పటికీ, వారికి మరణశిక్ష విధించినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. సాధారణంగా ఇలాంటి నేరాలకు మరణశిక్ష విధించిన దాఖలాలు లేవని కాన్సులేట్ పేర్కొంది.

మృతుడు నజ్రుల్ (20) బ్రాహ్మణ్‌బరియాకు చెందిన ఓ పేద రైతు కుటుంబానికి చెందినవాడు. అప్పు చేసి కుటుంబం అతడిని 2022 నవంబర్‌లో సౌదీకి పంపింది. అక్టోబర్ 11న చివరిసారిగా కుటుంబంతో మాట్లాడాడు. అతడి మరణవార్త విన్న 65 ఏళ్ల అత్త అబేదా బేగం గుండెపోటుతో మరణించారు. స్వీటీ అక్తర్ తమ కుమారుడి భార్య కాదని, వారిద్దరూ ఒకేచోట పనిచేస్తున్నారని మాత్రమే తమకు తెలుసని నజ్రుల్ తండ్రి తెలిపారు.

మరోవైపు, మృతురాలు స్వీటీ అక్తర్‌ది తంగైల్ ప్రాంతం. ఆమెకు విడాకులు కాగా, ఓ చిన్న కుమార్తె ఉంది. తనపై ఉన్న కేసు గురించి ఆమె కుటుంబానికి పెద్దగా చెప్పలేదు. రెండు నెలల్లో విడుదలవుతానని ఆశాభావం వ్యక్తం చేసింది.

తమ దేశ పౌరులకు మరణశిక్ష అమలు చేసే ముందు సమాచారం ఇవ్వకపోవడం వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ఆరోపిస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు, కేసు రికార్డులు అందించాలని సౌదీ అరేబియాను అధికారికంగా కోరింది. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  
Advertisement
Advertisement
Saudi Arabia
Bangladesh citizens execution
Mecca mosque immoral acts
Nazrul Islam Abdul Bashir
Sweety Akhtar
Saudi Bangladesh diplomatic tension

More Telugu News