Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేవంత్ సర్కార్‌పై రూ.50 వేల కోట్ల స్కాం ఆరోపణలు.. సీబీఐ విచారణకు క్రిశాంక్ డిమాండ్

Manne Krishank challenges CM Revanth Reddy to order CBI inquiry on land deals
Advertisement
  • రేవంత్ రెడ్డి సోదరుడి ప్రమేయంతోనే భూముల సెటిల్‌మెంట్లు అని క్రిశాంక్ ఆరోపణ
  • సెక్షన్ 22ఏ భూముల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగాయని వెల్లడి
  • బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్న
Advertisement
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ అండతో రూ.50,000 కోట్ల విలువైన కుంభకోణాలు జరిగాయని, ముఖ్యంగా సెక్షన్ 22ఏ కింద ఉన్న నిషేధిత భూముల వ్యవహారంలో భారీగా అవినీతి చోటుచేసుకుందని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి పాత్ర లేకపోతే, వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ భవన్ లో మీడియాతో క్రిశాంక్ మాట్లాడుతూ... ఈ భూ సెటిల్‌మెంట్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను బెదిరించడమే కాకుండా, భూదందాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించారు. చేవెళ్ల పరిధిలోని చందన్‌వల్లి గ్రామంలో సర్వే నంబర్ 363లోని అసైన్డ్ భూమిని వ్యవసాయ భూమిగా మార్చి, ఆర్9 కన్‌స్ట్రక్షన్స్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. ఈ కంపెనీలో కృష్ణారెడ్డి భాగస్వామిగా ఉన్నారని ఆరోపించారు. ఇలాంటి భూ కబ్జాల కోసమే సెక్షన్ 22ఏను వాడుకుంటున్నారని అన్నారు.

నియోజకవర్గానికి నిధులు కావాలంటే కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా క్రిశాంక్ గుర్తుచేశారు. ఇదే సమయంలో ఒక ఆసుపత్రి అమ్మకం, మ్యాక్స్‌బిన్ ఫార్మా, మైండ్‌వాల్ట్ కార్పొరేట్ స్కూళ్లతో సీఎం కుటుంబ సభ్యులకు ఉన్న సంబంధాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఆరోపణలపై బీజేపీ మౌనంగా ఉండటాన్ని కూడా ప్రశ్నించారు. ఈ కుంభకోణాలపై తమ వద్ద ఉన్న అన్ని పత్రాలు, డైరెక్టర్ల వివరాలు, వాటాల సమాచారాన్ని సీబీఐకి సమర్పించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, దమ్ముంటే విచారణకు ఆదేశించాలని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు.
Advertisement
Advertisement
Manne Krishank
Revanth Reddy
Telangana Land Scam
BRS Allegations
Section 22A Controversy
CBI Investigation Demand

More Telugu News