అలాంటి వాళ్లను కాల్చి చంపాలి.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలాంటి వాళ్లను కాల్చి చంపాలి.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Donald Trump sensational comments on shooting those who leak military secrets
  • సైనిక రహస్యాలు లీక్‌ చేసేవారిని కాల్చి చంపాలన్న ట్రంప్‌
  • ఇరాన్‌పై దాడి వివరాలు మీడియాకు లీకయ్యాయని ఆరోపణ
  • లీకేజీతో సైనిక చర్య సమయం మార్చినట్లు వెల్లడి
  • రెండు రోజుల తర్వాత దాడి నిర్వహించినట్లు ట్రంప్‌ ప్రకటన
  • లీకేజీకి పాల్పడిన వ్యక్తి వివరాలు వెల్లడించని అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైనిక రహస్యాలను బయటపెట్టే వారిని కాల్చి చంపాలని అన్నారు. ఇరాన్‌పై దాడికి సంబంధించిన కీలక సమాచారం మీడియాకు లీక్‌ కావడంతో సైనిక చర్య సమయాన్ని మార్చాల్సి వచ్చిందని వెల్లడించారు. ఇలాంటి వారికి జీవితాంతం జైలు శిక్ష విధించాలని కూడా వ్యాఖ్యానించారు.

అరిజోనా రాష్ట్రంలోని బుల్‌హెడ్‌ సిటీలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌ అణు కేంద్రాలపై దాడికి ముందు అమెరికా బాంబర్లు బయలుదేరే, చేరుకునే సమయాలు మీడియాకు చేరాయని ఆరోపించారు. ఈ వివరాలు న్యూయార్క్‌ టైమ్స్‌, సీఎన్‌ఎన్‌లో వచ్చినట్లు పేర్కొన్నారు.

దాడి సమయం మార్చాల్సి వచ్చింది!
మిస్సోరీ నుంచి బీ-2 స్టెల్త్‌ బాంబర్లు బయలుదేరే సమయం బయటకు పొక్కడంతో ఆపరేషన్‌ ప్రమాదంలో పడిందని ట్రంప్‌ చెప్పారు. ఈ విషయంపై సీనియర్‌ సైనికాధికారులతో చర్చించినట్లు తెలిపారు. జనరల్‌ రజిన్‌ కేన్‌తో మాట్లాడిన తర్వాత దాడిని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అప్పటికే దాడికి సిద్ధమైన పైలట్లు ఈ నిర్ణయంతో నిరాశకు గురయ్యారని చెప్పారు.

రెండు రోజుల తర్వాత దాడి
తొలుత అనుకున్న దాడిని రెండు రోజుల తర్వాత నిర్వహించినట్లు ట్రంప్‌ తెలిపారు. మొదట లీకైన సమయానికే బాంబర్లను పంపామని, దీంతో ఇరాన్‌ సైన్యాన్ని ఆశ్చర్యానికి గురిచేయగలిగామని పేర్కొన్నారు. అమెరికా సైనిక చర్యను ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా అభివర్ణించారు.

అయితే, లీకేజీకి పాల్పడిన వ్యక్తి ఎవరనే విషయాన్ని ట్రంప్‌ వెల్లడించలేదు. ఆరోపణలకు మద్దతుగా ఆధారాలు చూపలేదు. ఈ వ్యవహారంలో విచారణ ద్వారా ఎవరినైనా గుర్తించారా? అన్నదానిపైనా స్పష్టత ఇవ్వలేదు.

గూఢచర్య చట్టం కింద చర్యలు
అమెరికాలో జాతీయ రక్షణకు సంబంధించిన సమాచారాన్ని అనధికారికంగా బయటపెట్టడంపై కఠిన చట్టాలున్నాయి. అందులో ‘ఎస్పియోనేజ్‌ యాక్ట్‌’ కీలకమైనది. ఈ చట్టం కింద రహస్య సమాచారాన్ని అక్రమంగా భద్రపరచడం, ఇతరులకు చేరవేయడం వంటి చర్యలపై కేసులు నమోదు చేయవచ్చు. ఈ నేపథ్యంలో సైనిక రహస్యాల లీకేజీపై ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Advertisement
Donald Trump
Military Leaks
Iran Strike Secret
US Espionage Act
Bullhead City Arizona Rally
B-2 Stealth Bombers

More Telugu News