ఓట్ల లెక్కింపు వీడియోలు మాయం.. ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు ఫైర్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓట్ల లెక్కింపు వీడియోలు మాయం.. ఎన్నికల సంఘంపై సుప్రీం కోర్టు ఫైర్‌

Supreme Court slams Election Commission over missing vote counting videos
  • శృంగేరి ఎన్నికల వీడియోలపై ఈసీని నిలదీసిన సుప్రీంకోర్టు
  • రికార్డులు కనిపించడం లేదన్న సాకులను అంగీకరించబోమని స్పష్టీకరణ
  • అందుబాటులో ఉన్న రికార్డులన్నీ సమర్పించాలని ఆదేశం
  • రికార్డులు ఇవ్వకపోతే ప్రతికూల నిర్ణయం తప్పదని హెచ్చరిక
  • తదుపరి విచారణ 2027 ఫిబ్రవరి 15న
ఎన్నికల సమయంలో ఓట్ల లెక్కింపు వీడియోలనే భద్రపరచలేకపోతే ఎలా? అంటూ సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని నిలదీసింది. కర్ణాటకలోని శృంగేరి అసెంబ్లీ నియోజకవర్గం 2023 ఎన్నికల అసలు లెక్కింపు వీడియోలు కనిపించడం లేదన్న సమాధానంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి సాకులను అంగీకరించబోమని స్పష్టం చేసింది. తదుపరి విచారణకు అందుబాటులో ఉన్న రికార్డులన్నీ సమర్పించాలని ఆదేశించింది. లేకపోతే ప్రతికూల నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

2023 ఎన్నికల్లో శృంగేరి స్థానం నుంచి కాంగ్రెస్‌ నేత టీడీ రాజేగౌడ తొలుత గెలిచారు. అయితే బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌ ఈ ఫలితాన్ని కర్ణాటక హైకోర్టులో సవాలు చేశారు. దీంతో తిరస్కరించిన పోస్టల్‌ బ్యాలెట్లను మరోసారి పరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో 279 పోస్టల్‌ ఓట్లను తిరిగి తనిఖీ చేయాలని సూచించింది.

రీకౌంటింగ్‌ తర్వాత ఫలితం మారింది. జీవరాజ్‌ విజయం సాధించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. దీంతో రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు పెండింగ్‌లో ఉన్నంతకాలం ఎమ్మెల్యేగా కొనసాగేందుకు ఆయనకు సుప్రీంకోర్టు మే నెలలో మధ్యంతర ఊరట ఇచ్చింది.

తాజా విచారణలో అసలు లెక్కింపు వీడియోలు కనిపించడం లేదని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది తెలిపారు. దీనిపై జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌, జస్టిస్‌ సంజీవ్‌ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించే సంస్థ వద్ద వాటికి సంబంధించిన రికార్డులు లేకపోవడంపై ప్రశ్నించింది.

ఎన్నికల పరిశీలకుడి నివేదికతో పాటు అసలు లెక్కింపు, రీకౌంటింగ్‌ వీడియోలను అందించాలని రాజేగౌడ కోరుతున్నారు. అందుబాటులో ఉన్న రికార్డులన్నీ సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2027 ఫిబ్రవరి 15కు వాయిదా వేసింది.
Advertisement
Supreme Court of India
Election Commission
TD Rajegowda
Sringeri Assembly Constituency
Karnataka Election 2023
Missing Counting Videos

More Telugu News