కిడ్నీలో రాయికి చికిత్స.. ప్రాణాలు కోల్పోయిన ఎల్ఎల్‌బీ గోల్డ్ మెడలిస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కిడ్నీలో రాయికి చికిత్స.. ప్రాణాలు కోల్పోయిన ఎల్ఎల్‌బీ గోల్డ్ మెడలిస్ట్

LLB gold medalist dies during kidney stone treatment
  • సికింద్రాబాద్ ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో యువ న్యాయవాది ఐశ్వర్య మృతి
  • కిడ్నీలో రాయి చికిత్సలో వైద్య నిర్లక్ష్యం జరిగిందని కుటుంబం ఆరోపణ
  • ప్లేట్‌లెట్లు పడిపోయి బ్రెయిన్ హెమరేజ్‌తో మరణించారని ఆసుపత్రి వివరణ
  • ఆసుపత్రి ఎదుట న్యాయవాదులు, కుటుంబ సభ్యుల ఆందోళన
  • విచారణ జరపాలని ఆరోగ్య శాఖ మంత్రిని కోరిన న్యాయవాదులు
సికింద్రాబాద్‌లోని ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ యువ న్యాయవాది మృతి చెందారు. కిడ్నీలో రాయికి చికిత్స పొందుతూ 28 ఏళ్ల ఐశ్వర్య మంగళవారం కన్నుమూశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు, తోటి న్యాయవాదులు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగారు.

ఎల్‌ఎల్‌బీలో గోల్డ్ మెడల్ సాధించిన ఐశ్వర్యకు ఇటీవలే వివాహమైంది. కడుపు నొప్పితో బాధపడుతుండటంతో ఆమెను అక్టోబరు 6న  ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో 2 మిల్లీమీటర్ల పరిమాణంలో రాయి ఉందని, దానికి సర్జరీ అవసరమని చెప్పారని కుటుంబం చెబుతోంది. వాస్తవానికి అంత చిన్న రాయి మందులతోనే కరిగిపోతుందని, కానీ ఆసుపత్రి యాజమాన్యం శస్త్రచికిత్స చేయాలని ఒత్తిడి చేసి, ప్రాథమికంగా రూ.3 లక్షలు కట్టించుకుందని ఆరోపించారు.

చికిత్స సమయంలో ఐశ్వర్య రక్తపోటు ఒక్కసారిగా పడిపోవడంతో ఆమెను మెడికల్ ఐసీయూకి తరలించినట్లు వైద్యులు తెలిపారు. యాంటీబయాటిక్స్ ఇచ్చినా ఆమె పరిస్థితి మెరుగుపడలేదని, 80 శాతం బ్రెయిన్ డెడ్ అయిందని కుటుంబానికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమె మరణించారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు స్పందిస్తూ... కిడ్నీ నుంచి మూత్రనాళానికి వెళ్లే మార్గంలో పెద్ద రాయి అడ్డుపడటంతోనే శస్త్రచికిత్స చేశామని తెలిపాయి. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ సోకి, ప్లేట్‌లెట్ల సంఖ్య తగ్గిపోయి, మెదడులో రక్తస్రావం (బ్రెయిన్ హెమరేజ్) కావడంతో మరణం సంభవించిందని వివరించాయి.

ఐశ్వర్య మరణంతో కుటుంబ సభ్యులు, తోటి న్యాయవాదులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధ్యులైన వైద్యులను వెంటనే అరెస్ట్ చేయాలని, ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం పలువురు సీనియర్ న్యాయవాదులు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

మొత్తం చికిత్స కోసం రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చు చేసినట్లు కుటుంబం చెబుతోంది. కిడ్నీలో రాయి పరిమాణం, శస్త్రచికిత్స ఆవశ్యకత, మరణానికి దారితీసిన పరిస్థితులపై కుటుంబం, ఆసుపత్రి ఇస్తున్న పరస్పర విరుద్ధమైన వాదనలతో గందరగోళం నెలకొంది. 
Advertisement
Aishwarya
LLB Gold Medalist Death
Kidney Stone Surgery

More Telugu News